చోరీకి పాల్పడిన మహిళ రిమాండ్
జ్యూవెలరీ షాప్‌లో సేల్స్ మెన్ దృష్టి మళ్లించి బంగారు ఆభరణాన్ని చోరీకి పాల్పడిన మహిళను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
దిశ, కూకట్పల్లి : జ్యూవెలరీ షాప్‌లో సేల్స్ మెన్ దృష్టి మళ్లించి బంగారు ఆభరణాన్ని చోరీకి పాల్పడిన మహిళను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.2.9 లక్షల విలువైన 74 గ్రాముల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం జ్యూవెలరీ షాప్‌లను టార్గెట్‌గా చేసుకుని దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. మియాపూర్ గోకుల్ టవర్స్‌కు చెందిన పుట్ట సునిత(41) జ్యూవెలరీ షాప్‌లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాప్‌లోని నకోడ జ్యూవెలరీ షాప్‌లో 23వ తేదీన స్టాక్ చెక్ చేస్తుండగా సుమారు 74 గ్రాముల బంగారు ఆభరణం కనిపించలేదు.
దీంతో షాప్ యజమాని సీసీ టీవీ పుటేజీ చెక్ చేయగా 23వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ మహిళ ముఖానికి స్కార్ప్ కట్టుకుని వచ్చి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నట్టు చేసి సేల్స్‌మెన్ కళ్లుగప్పి బంగారు ఆభరాణ్ని చోరీ చేసినట్టు గుర్తించి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా గతంలోనే వరుసగా ఇదే ప్యాటర్న్‌లో చోరీలకు పాల్పడిన పుట్ట సునితగా గుర్తించారు. సునితను పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు మంగళవారం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. నిందితురాలి నుంచి బంగారు ఆభరాణాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసును చాకచక్యంగా చేధించినందుకు కేపీహెచ్భీ డీఐ కె. రవి కుమార్, క్రైం సిబ్బందిని డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాస్ రావులు అభినందించారు.