Kota: కోటాలో 50 శాతం తగ్గిన ఆత్మహత్యలు.. గతేడాది కంటే తక్కువగా నమోదు
కోచింగ్ హబ్‌గా పిలవబడే రాజస్థాన్‌లోని కోటా నగరంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: ఐఐటీ, జేఈఈ ప్రవేశ పరీక్షల కోచింగ్ హబ్‌గా పిలవబడే రాజస్థాన్ (Rajasthan)లోని కోటా (Kota) నగరంలో గత కొన్నేళ్లుగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐఐటీ(IIT), జేఈఈ(JEE) వంటి పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఏడాది విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 50 శాతం తగ్గిందని కోటా జిల్లా అధికారులు వెల్లడించారు. 2023లో 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకోగా 2024లో ఆ సంఖ్య 17కు తగ్గిందని తెలిపారు. జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు (Coaching institutions), హాస్టళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం వల్లే ఆత్మహత్యల సంఖ్య తగ్గుముఖం పట్టిందని కలెక్టర్ రవీంద్ర గోస్వామి తెలిపారు.
‘డిన్నర్ విత్ కలెక్టర్’ (Dinner with collector), ‘సంవాద్’ వంటి ఈవెంట్‌ల ద్వారా కోచింగ్ తీసుకునే విద్యార్థులతో రెగ్యులర్ ఇంటరాక్టివ్ సెషన్‌లు, అలాగే మహిళల భద్రత, బాలికల భద్రత కోసం నిరంతరం కార్యక్రమాలు నిర్వహించినట్టు వెల్లడించారు. హాస్టల్ వార్డెన్‌లకు గేట్ కీపర్ శిక్షణ, డబ్ల్యూహెచ్‌వో నిబంధనల ఆధారంగా ఎస్‌ఓఎస్ హెల్ప్ సేవలను అమలు చేయడం కూడా ఆత్మహత్య కేసుల తగ్గుదలకు దోహదపడ్డాయని తెలిపారు. అదే సమయంలో కోటాకు కోచింగ్ నిమిత్తం వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గినట్టు చెప్పారు.