Delhi : ఢిల్లీ సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.. ఆప్ విమర్శలకు ఎల్జీ కౌంటర్
ఢిల్లీ సీఎం అతిశీ(Delhi CM Atishi), లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అతిశీ(Delhi CM Atishi), లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హిందూ, బౌద్ధ ప్రార్థనా స్థలాలను కూల్చివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్(Delhi LG) కార్యాలయం ఆదేశాలు జారీ చేసిందని అతిశీ ఆరోపించారు. కాగా.. ఈ ఆరోపణలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) తోసిపుచ్చారు. ఆప్ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి మతపరమైన కట్టడాలు లేదా దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూల్చివేయట్లేదని పేర్కొంది. తమకు ఎలాంటి ఫైల్ అందలేదంది. "ఒకవేళ ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వక విధ్వంసానికి పాల్పడే శక్తులపై మరింత నిఘా ఉంచాలని ఎల్జీ పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆయన సూచనలను పాటిస్తున్నాం" అని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు.
ఎల్జీపై సీఎం ఆరోపణలు
ఇకపోతే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అతిశీ తీవ్ర విమర్శలు చేశారు. " ఎల్జీ ఆదేశాలపై మతపరమైన కమిటీ ఏర్పడింది. ఢిల్లీ అంతటా బహుళ మతపరమైన నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించింది" అని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉండి.. ఎలాంటి మతపరమైన మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఎల్జీ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వును ఆమె ప్రస్తావించారు. మతపరమైన కట్టడాలను కూల్చివేయడమనేది "పబ్లిక్ ఆర్డర్"కి సంబంధించిన విషయమని.. అది ఎల్జీ కార్యాలయం పరిధిలోకి వస్తుందన్నారు. మతపరమైన కమిటీ పనితీరుని ఎల్జీ నేరుగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆ ఫైల్ లో సీఎం లేదా హోంమంత్రి కార్యాలయానికి రావట్లేదని.. నేరుగా ఎల్జీ కార్యాలయానికి మళ్లిస్తున్నట్లు ఆరోపించారు. కాగా.. ఈ వ్యాఖ్యలపైనే ఎల్జీ కార్యాలయం స్పందించింది.