Arvind Kejriwal: ఓట్లు కొనడాన్ని సమర్థిస్తారా?.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కేజ్రీవల్ లేఖ
ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్ (Mohan Bhagwat)కు ఆమ్ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లేఖ రాశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌భాగవత్ (Mohan Bhagwat)కు ఆమ్ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లేఖ రాశారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ మోహన్ భగవత్ కు రాసిన లేఖ వైరల్ గా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ డబ్బు పంచుతుందని.. దీన్ని ఆర్ఎస్ఎస్ (RSS) సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. ‘ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ నేతలు బహిరంగంగానే డబ్బులు పంచుతున్నారు. ఓట్లు కొనడాన్ని ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా?. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న పేదలు, దళితులు, పూర్వాంచల్ ప్రజలు, మురికివాడల్లో వారి ఓట్లను చీల్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా చేయడం భారత ప్రజాస్వామ్యానికి సరైందని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తుందా?. ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని మీకు అనిపించడం లేదా?’ అని భాగవత్‌ను ప్రశ్నించారు. అంతేకాకుండా, కాషాయ పార్టీ చేస్తున్న తప్పులకు మద్దతిస్తున్నారా అని మోహన్ భగవత్ ని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘ఢిల్లీ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్.. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? ఇంతకు ముందు, ఈ మధ్య కాలంలో బీజేపీ చేసిన అక్రమాలకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతిస్తుందో లేదో ప్రజలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు.
కేజ్రీవాల్ పై బీజేపీ విమర్శలు
కేజ్రీవాల్ లేఖపై బీజేపీ స్పందించింది. కొత్త సంవత్సరంలో అబద్ధాలను చెప్పడం, తప్పుడు వాగ్దానాలు చేయడం వంటివి మానుకోవాలని సలహాలు ఇచ్చింది. “కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పడం మానేసి మా ప్రశ్నలకు జవాబివ్వాలి. కొత్త సంవత్సరంలో కేజ్రీవాల్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఢిల్లీ ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన తన పిల్లలపై తప్పుడు ప్రమాణాలు చేయరని ఆశిస్తున్నాను. దేశ వ్యతిరేక శక్తుల నుంచి వచ్చే విరాళాలను స్వీకరించబోమని ప్రతిజ్ఞ చేయాలి. తప్పుడు వాగ్దానాలు చేయబోని కేజ్రీవాల్ ప్రమాణం చేయాలి' అని బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ఇకపోతే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేయనుంది. ఈమేరకు 70 స్థానాలకు అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది.