'ప్రభుత్వం మరో ఎన్నికల హామీ.. కాంగ్రెస్ ఏదైనా చెబితే.. చేసి చూపిస్తుంది'

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమల్లోకి తెచ్చింది.

Update: 2023-08-30 14:59 GMT

బెంగళూరు : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమల్లోకి తెచ్చింది. కుటుంబ పెద్దగా ఉన్న ప్రతీ మహిళకు నెలకు రూ.2 వేలు చొప్పున ఆర్థికసాయాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘గృహ లక్ష్మి యోజన’ పథకం ప్రారంభమైంది. కర్ణాటకలోని మైసూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ లు గృహ లక్ష్మి స్కీమ్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ ఏదైనా చెబితే అది చేసి చూపిస్తుందని కర్ణాటకలోని తమ ప్రభుత్వం నిరూపించిందని రాహుల్ గాంధీ అన్నారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన గృహలక్ష్మితో పాటు శక్తి యోజన, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి యోజనలను ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. ‘‘మేం ఇక్కడ ట్యాబ్‌లో ఒక్క క్లిక్ చేయగానే 1.1 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2000 చొప్పున జమయ్యాయి” అని రాహుల్ చెప్పారు. ‘‘కర్ణాటకలో భారత్ జోడో యాత్ర చేసిన క్రమంలో వేలాది మంది మహిళలను కలిశాను. నిత్యావసరాల ధరల బాధను వాళ్లు నాతో పంచుకున్నారు. వారికి ఊరట కల్పించేందుకే గృహలక్ష్మి స్కీమ్‌ను ఇక్కడ తీసుకొచ్చాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పలువురు కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు.


Similar News