Ramleela : హరిద్వార్ జైలులో ‘రాంలీల’.. వానరుల పాత్రలో నటిస్తూ పరారైన ఖైదీలు

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు.

Update: 2024-10-12 14:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. శుక్రవారం రోజే ఖైదీలు పరార్ కాగా.. ఆ విషయం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. జైలులోని ఖైదీలంతా కలిసి శుక్రవారం రోజు ‘రాంలీల’ నాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో రాజ్‌కుమార్, పంకజ్ అనే ఖైదీలు వానరుల పాత్రను పోషించారు. నాటికలో భాగంగా సీతామాతను వెతికేందుకు వానరులు బయలుదేరి వెళ్లే ఘట్టం వచ్చింది. ఈసందర్భంగా వానరుల పాత్రలో ఉన్న రాజ్‌కుమార్, పంకజ్ స్టేజీ నుంచి దూకి వెళ్లారు. అయితేే వారిద్దరూ ఎంతకూ తిరిగి రాలేదు.

అక్కడున్న జైలు సిబ్బంది ఆవిషయాన్ని పెద్దగా గమనించలేదు. ఆ తర్వాత విచారణ చేయగా.. రాజ్‌కుమార్, పంకజ్‌లు జైలు నుంచి పరారయ్యారని తేలింది. నిర్మాణ పనుల కోసం జైలుకు తెప్పించిన తాడును వాడుకొని.. వాళ్లిద్దరూ గోడ దూకి పరారైనట్లు వెల్లడైంది. పంకజ్ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వాస్తవ్యుడు. అతడు హరిద్వార్ జిల్లా జైలులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. రాజ్‌కుమార్ విచారణ ఖైదీగా జైలులో ఉంటున్నాాడు. వారిద్దరి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక టీమ్‌ను జైలు అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై విచారణకు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 


Similar News