Mass Resignations : డాక్టర్ల మూకుమ్మడి రాజీనామాలు.. సీఎం ముఖ్య సలహాదారుడి కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి.

Update: 2024-10-12 13:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. కోల్‌కతాలో పలువురు జూనియర్ డాక్టర్లు గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి సంఘీభావంగా బెంగాల్‌లో చాలామంది సీనియర్ వైద్యులు ఇప్పటికే సీఎం కార్యాలయానికి రాజీనామా లేఖలను పంపారు. దీనిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారుడు ఆలాపన్ బంద్యోపాధ్యాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ డాక్టర్ల మూకుమ్మడి రాజీనామాలకు చట్టపరంగా విలువ ఉండదని.. అవి చెల్లవని ఆయన స్పష్టం చేశారు. సీఎం కార్యాలయానికి వచ్చిన సీనియర్ డాక్టర్ల రాజీనామా లేఖల్లో వివరాలేవీ స్పష్టంగా, సమగ్రంగా లేవని ఆలాపన్ బంద్యోపాధ్యాయ్ చెప్పారు. ‘‘ఆ లేఖల్లో మూకుమ్మడి రాజీనామాలు అనే పదాన్ని వాడారు. అందువల్ల వాటిని మేం పరిగణించలేకపోతున్నాం. వ్యక్తిగత అంశాల ప్రాతిపదికన రాజీనామా సమర్పిస్తేనే ఆమోదం లభిస్తుంది’’ అని ఆయన తేల్చి చెప్పారు.

ఇక కోల్‌కతాలో అక్టోబరు 5 నుంచి నిరాహార దీక్షలో కూర్చున్న డాక్టర్ల ఆరోగ్యం క్షీణిస్తోంది. నిరసనను ఆపేయమని చెప్పాలంటూ తమ కుటుంబంపై పోలీసులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరు జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఈనేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్స్ (ఫైమా) కీలక ప్రకటన విడుదల చేసింది. నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఏదైనా జరిగితే దేశవ్యాప్తంగా వైద్యసేవలను పూర్తిగా ఆపేస్తామని హెచ్చరించింది. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేలా చొరవ చూపాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోరింది. 


Similar News