Ajmer Dargah :‘‘అజ్మీర్ దర్గాలో శివాలయం?’’ ఉందంటూ పిటిషన్.. ఏఎస్ఐ, కేంద్రం, దర్గా కమిటీలకు నోటీసులు
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా(Ajmer Dargah)లో శివాలయం ఉందంటూ సెప్టెంబరులో దాఖలైన సివిల్ పిటిషన్‌ను విచారించిన అజ్మీర్ కోర్టు(Ajmer court) బుధవారం మూడు పక్షాలకు నోటీసులు జారీ చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గా(Ajmer Dargah)లో శివాలయం ఉందంటూ సెప్టెంబరులో దాఖలైన సివిల్ పిటిషన్‌ను విచారించిన అజ్మీర్ కోర్టు(Ajmer court) బుధవారం మూడు పక్షాలకు నోటీసులు జారీ చేసింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ, అజ్మీర్ దర్గా కమిటీలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబరు 20కి షెడ్యూల్ చేసింది. హిందూసేన అనే సంస్థను నిర్వహించే విష్ణుగుప్తా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున అడ్వకేట్ యోగేశ్ సిరోజా.. అజ్మీర్ కోర్టు సివిల్ జడ్జి మన్మోహన్ చండేల్ ఎదుట వాదనలు వినిపించారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలో శివాలయం ఉన్న ప్రదేశంలో పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించాలని కోర్టును కోరారు. ‘‘అజ్మీర్ దర్గాను సంకట్ మోచన్ మహాదేవ్ ఆలయం(Hindu temple)గా ప్రకటించాలి’’ అని విష్ణుగుప్తా వాదిస్తుండటం గమనార్హం.
రిటైర్డ్ న్యాయమూర్తి హర్ విలాస్ శారదా 1911లో రాసిన ‘అజ్మీర్ : హిస్టారికల్ అండ్ డిస్క్రిప్టివ్’ అనే పుస్తకంలోని కొన్ని వాక్యాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. ‘‘అజ్మీర్ దర్గాతో పాటు బులంద్ దర్వాజాలలో హిందూ నిర్మాణ శైలిని తలపించే చెక్కడాలు ఉన్నాయి. ఈవిషయాన్ని హర్ విలాస్ శారదా పుస్తకంలో ప్రస్తావించారు’’ అని తన పిటిషన్‌లో విష్ణుగుప్తా పేర్కొన్నారు. ‘‘ప్రాచీన శివాలయం శిథిలాలను అజ్మీర్ దర్గా నిర్మాణానికి వాడుకున్నారు. దర్గా ప్రధాన ప్రదేశం కింద జైన ఆలయం ఉంది’’ అనే అంశాలను సైతం పిటిషనర్ ప్రస్తావించడం గమనార్హం. అయితే ఈ ఆరోపణలను అజ్మీర్ దర్గా కమిటీ ఖండించింది.