Jharkhand : ఎన్‌డీఏతో ఇండియా ఢీ.. జార్ఖండ్‌లో హోరాహోరీ

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌(Jharkhand)లో అధికార పీఠం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సారథ్యంలోని ఇండియా(INDIA) కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి.

Update: 2024-11-03 16:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌(Jharkhand)లో అధికార పీఠం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సారథ్యంలోని ఇండియా(INDIA) కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇప్పుడు పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఎన్‌డీఏ(NDA) కూటమిని లీడ్ చేస్తున్న బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ కూటమిలోని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 10 స్థానాల్లో, బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజకీయ పార్టీ జేడీయూ 2 స్థానాల్లో, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ రాజకీయ పార్టీ ఎల్‌జేపీ (రాంవిలాస్) 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఇక ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న జేఎంఎం 41 స్థానాల్లో, కాంగ్రెస్ 30 స్థానాల్లో, ఆర్‌జేడీ 6 స్థానాల్లో, సీపీఐ (మార్క్సిస్ట్ - లెనినిస్ట్) 4 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

తొలి విడత, రెండో విడత పోలింగ్ లెక్కలివీ..

జార్ఖండ్‌లోని 43 స్థానాలకు నవంబరు 13న తొలి విడత పోలింగ్ జరగనుంది. మిగతా 38 స్థానాలకు నవంబరు 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల్లో 683 మంది, రెండో విడతలో 528 మంది పోటీ చేస్తున్నారు. తొలి విడతలో.. అత్యధికంగా జంషెడ్‌పూర్ పశ్చిమ స్థానం నుంచి 28 మంది, అత్యల్పంగా మానిక స్థానంలో 9 మంది పోటీ చేస్తున్నారు. రెండో విడతలో.. అత్యధికంగా ధన్వర్ అండ్ బొకారో స్థానం నుంచి 27 మంది, అత్యల్పంగా దేవ్ ఘర్ సీటు నుంచి 8 మంది పోటీ చేస్తున్నారు.

ప్రాధాన్యమున్న స్థానాలివీ..

జార్ఖండ్‌లో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమున్న అసెంబ్లీ స్థానాల జాబితాలో ‘సరైకేలా’ ఒకటి. ఈ సీటు నుంచి మాజీ సీఎం, బీజేపీ నేత చంపై సోరెన్ పోటీ చేస్తున్నారు. జంషెడ్‌పూర్ ఈస్ట్ స్థానం నుంచి ఒడిశా గవర్నర్, మాజీ సీఎం రఘువర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహూ పోటీ చేస్తున్నారు. జంషెడ్‌పూర్ ఈస్ట్ స్థానం నుంచి జేడీయూ అభ్యర్థిగా సరయూ రాయ్ బరిలోకి దిగారు. రాంచీ స్థానంలో జేఎంఎం రాజ్యసభ ఎంపీ మహువా మాంఝీ, బీజేపీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సి.పి.సింగ్ తలపడుతున్నారు. జేఎంఎం అధినేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బర్హైత్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం సతీమణి కల్పనా సోరెన్ గండేయ్ స్థానం నుంచి, సీఎం సోదరుడు వసంత్ సోరెన్ డుమ్కా స్థానం నుంచి బరిలోకి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ ధన్వర్ స్థానం నుంచి, శిబూ సోరెన్ కోడలు, బీజేపీ నేత సీతాసోరెన్ జాంతార స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ప్లస్ వర్సెస్ మైనస్..

అవినీతి ఆరోపణలు, బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి చొరబాట్లు, హేమంత్ సోరెన్ కుటుంబ పెత్తనం వంటి అంశాలు ఇండియా కూటమికి మైనస్ పాయింట్లుగా మారే ఛాన్స్ ఉంది. ఇక హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చారు. ఈ అంశం ప్రభావంతో గిరిజన, ఆదివాసీ వర్గాలకు చెందిన సానుభూతి ఓట్లు జేఎంఎంకు పడే అవకాశం లేకపోలేదు. జార్ఖండ్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన భారీ ప్రాజెక్టులు బీజేపీకి ప్లస్ పాయింట్‌గా మారొచ్చు. అయితే నిత్యావసరాల ధరల మంట, పెట్రోలు ధరల మంట, నిరుద్యోగం వంటి అంశాలు కమలదళానికి మైనస్ పాయింట్లుగా పరిణమించే అవకాశం ఉంది.

Tags:    

Similar News