Jammu kashmir: జమ్మూ కశ్మీర్‌లో రేపే తొలి పోరు.. బరిలో నిలిచిన ప్రముఖులు వీరే ?

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోరుకు రంగం సిద్ధమైంది. 24 నియోజకర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది.

Update: 2024-09-17 16:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోరుకు రంగం సిద్ధమైంది. కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు జిల్లాల్లోని 24 నియోజకర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఇందులో జమ్మూ డివిజన్‌లో 8, కశ్మీర్ డివిజన్‌లో 16 సెగ్మెంట్లు ఉన్నాయి. మొదటి దశలో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 9 మంది మహిళా అభ్యర్థులు ఉండగా 92 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. మొత్తం 23,27,580 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళలు ఉండగా.. 60 మంది థర్డ్ జెండర్లున్నారు. వీరంతా ఓటు వేసేందుకు 24 నియోజకవర్గాల్లో 3,276 పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. 14000 మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది. ఇప్పటికే దోడా జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 534 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలతో తరలివెళ్లారు.

ఇల్తిజా ముఫ్తీపైనే అందరి దృష్టి

తొలిదశ ఎన్నికల్లో పలువురు ప్రముఖ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ( పీడీపీ) నేత ఇల్తిజా ముఫ్తీ ఉన్నారు. అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహరా స్థానం నుంచి ఆమె బరిలో నిలిచారు. దీంతో అందరి దృష్టి ఈ సెగ్మెంట్ పైనే ఉంది. ఆమె నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత బషీర్ అహ్మద్ వీరీ, బీజేపీ అభ్యర్థి సోఫీ మహ్మద్ యూసుఫ్‌తో పోటీ పడుతున్నారు. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, సీపీఎంకు చెందిన మహ్మద్ యూసుఫ్ తరిగామి, పీడీపీ సీనియర్ నేత వహీద్ పారా, ఎన్సీ నేత ఖలీద్ నజీబ్ సుహర్వాడి, కశ్మీరీ పండిట్ల వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సరాఫ్, ఎన్సీకి చెందిన సకీనా ఇటూలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

భారీగా భద్రతా బలగాల మోహరింపు

ఎన్నికల నేపథ్యంలోనే పలు ఉగ్రదాడులు జరగడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పారామిలిటరీ ఫోర్సెస్ (సీఎపీఎఫ్), జమ్మూ కాశ్మీర్ ఆర్మ్‌డ్ పోలీసులు, ఇతర బలగాలను 24 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం భద్రతను సమీక్షించనున్నామని కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వికె బిర్డి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్భంధీ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.

పదేళ్ల తర్వాత ఎన్నికలు

జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు ప్రస్తుతం ఎన్నడూ లేనంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో పాటు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న మొదటి ఎలక్షన్స్ ఇవే కావడం గమనార్హం. దీంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జమ్మూకశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు బీజేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2018లో కూటమి చీలిపోవడంతో ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీలో ఉండగా..కాంగ్రెస్, ఎన్సీ కలిసి పోటీ చేస్తున్నాయి. మరో ప్రాంతీయ పార్టీ పీడీపీ సైతం 40 స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది. 


Similar News