Financial Action Task Force : కశ్మీర్‌లో ఉగ్ర సంస్థలకు ఆర్థిక వనరులు అందే ముప్పు : ఎఫ్ఏటీఎఫ్
దిశ, నేషనల్ బ్యూరో : ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా పర్యవేక్షించేందుకు జీ7 దేశాల కూటమి ఏర్పాటు చేసిన సంస్థ పేరు ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ (ఎఫ్ఏటీఎఫ్). ఇది భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా పర్యవేక్షించేందుకు జీ7 దేశాల కూటమి ఏర్పాటు చేసిన సంస్థ పేరు ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ (ఎఫ్ఏటీఎఫ్). ఇది భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. తమ మార్గదర్శకాలను భారత్ కొనియాడదగిన రీతిలో అమలు చేస్తోందని పేర్కొంది. ఈమేరకు వివరాలతో గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగతిని సాధిస్తున్న ప్రస్తుత తరుణంలో మనీలాండరింగ్ వ్యవహారాలు, ఉగ్రవాద సంస్థలకు ఫైనాన్సింగ్‌పై భారత్ నిఘాను మరింత ముమ్మరం చేయాలని ఎఫ్ఏటీఎఫ్ సూచించింది.
ఫైనాన్షియల్ ఇంటెలీజెన్స్ విషయంలో భారత్ చాలా వికాసాన్ని సాధించిందని వెల్లడించింది. తమ సంస్థకు చెందిన రెగ్యులర్ ఫాలో అప్ కేటగిరీలో భారత్ ఉందని తెలిపింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు మరో నాలుగు జీ20 దేశాలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక మోసాలు, సైబర్ మోసాలు, అవినీతి వ్యవహారాలు, డ్రగ్స్ రవాణా అనేవి భారత్‌లో మనీలాండరింగ్‌కు ప్రధాన మాధ్యమాలుగా ఉన్నాయని నివేదికలో ప్రస్తావించారు. జమ్మూకశ్మీర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్ర సంస్థలు, వాటి సానుభూతిపరులకు ఆర్థిక వనరులు అందే ముప్పు ఉందని ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరించింది. ఈవిషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.