iPhone: పొరపాటు హుండీలో భక్తుడి ఐ ఫోన్.. తిరిగి ఇస్తారని వెళ్తే..
పొరపాటు దేవుడి హుండీలో భక్తుడి ఐ ఫోన్ జారిపడటం వైరల్ గా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్లిన ఓ భక్తుడికి హుండీ రూపంలో షాక్ తగిలింది. ఆలయంలో అనుకోకుండా హుండీ (hundi)లో తన ఐఫోన్ పడిపోయింది. దీంతో తిరిగి తన ఫోన్ ఇస్తారని ఆశపడిన సదరు భక్తుడికి టెంపుల్ అధికారులు షాక్ ఇచ్చారు. ఒక్కసారి హుండీలో చేరిందంటే అది దేవుడి ఖాతాలోకేనని ఫోన్ ను తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడు (Tamil Nadu) లోని తిరుపొరూర్ లోని మురుగన్ (Murugan Temple) ఆలయానికి చెన్నె అంబత్తూరుకు చెందిన దినేశ్ రెండు నెలల క్రితం కుటుంబంతో సహా దర్శనానికి వెళ్లాడు. హుండీలో కానుకులు వేస్తున్న సందర్భంలో పొరపటాను ఆయన చేతిలో ఉన్న ఐఫోన్ కూడా హుండీలో పడిపోయింది. వెంటనే ఈ విషయాన్ని అతడు ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. హుండీ సమయంలో చెబుతామని అధికారులు దినేశ్ కు చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం ఆలయంలో హుండీని లెక్కించేందుకు తెరిచారు. అదులో దినేశ్ ఐ ఫోన్ కూడా బయటపడింది. అయితే రెండు నెలల తర్వాత ఫోన్ తన చేతికి వస్తుందని ఆశపడిన అతడికి నిరాశే ఎదురైంది. ఫోన్ ను తిరిగి ఇచ్చేది లేదని, హుండీలో జమ చేసిన వస్తువు దేవుడి ఖాతాలోకి వెళ్తుందని అధికారులు తేల్చి చెప్పారు. ఫోన్ ను తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు. అయితే సిమ్ కార్డుతో పాటు ఫోన్ లో ఉన్న డేడాను వెనక్కి తీసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో చేసేదేమి లేక సిమ్ కార్డు తీసుకుని అక్కడి నుంచి అతడు వెళ్లిపోయాడు.