Arlekar: రాజేంద్ర అర్లేకర్ గాంధీని అవమాన పర్చారు.. బిహార్ గవర్నర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్
బిహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ‘బ్రిటిష్ వాళ్లు ఇండియాను విడిచిపెట్టడానికి గల కారణం గాంధీజీ చేసిన సత్యాగ్రహం కాదు. ప్రజలు ఆయుధాలు పట్టుకుని బెదిరించడం వల్లే వారు దేశాన్ని వీడారు. స్వాతంత్ర్యం కోసం ఎంతకైనా తెగిస్తారని గ్రహించి వెళ్లిపోయారు’ అని బిహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ (Rajendra arlekar) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ (Pramod thiwari) స్పందించారు. స్వాతంత్ర్య సమరయోధులను బీజేపీ అగౌరవపరుస్తోందని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) అంబేడ్కర్‌ను అవమానించారు. ఇప్పుడు బిహార్ గవర్నర్ మహాత్మా గాంధీని అగౌరవపరిచారు. ఇది భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని అవమానించడమే. గాంధీని, అంబేడ్కర్‌ను అగౌరవపరచడం బీజేపీ ప్రణాళికలో భాగమే’ అని వ్యాఖ్యానించారు. అర్లేకర్ వ్యాఖ్యలు సరికాదని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ మాట్లాడుతూ.. బీజేపీ ఎలాంటి చరిత్ర సృష్టించలేదు, అందుకే చరిత్రను వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు. గాంధీ, అంబేడ్కర్‌లకు బీజేపీ భయపడుతోందని ఆరోపించారు.