ఇస్రో మరో ఘనత: పుష్పక్ విమానం ప్రయోగం సక్సెస్

అంతరిక్షంలో దూసుకుపోతున్న ఇస్రో తాజాగా మరో ఘనతను సాధించింది. రెక్కలతో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్(ఆర్‌ఎల్‌వీ) పుష్పక్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది

Update: 2024-06-23 06:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అంతరిక్షంలో దూసుకుపోతున్న ఇస్రో తాజాగా మరో ఘనతను సాధించింది. రెక్కలతో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్(ఆర్‌ఎల్‌వీ) పుష్పక్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్‌లో ఉదయం ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు ప్రయోగం సక్సెస్ కాగా, ఇప్పుడు మూడోది కూడా విజయవంతమైంది. భారత వైమానిక దళం చినూక్ హెలికాప్టర్ నుండి 4.5 కి.మీ ఎత్తులో 'పుష్పక్'‌ను గాల్లోకి విడిచారు. ఆ తరువాత అది ఆటో‌మెటిక్‌గా రేంజ్‌ను అడ్జెస్ట్ చేసుకుంటూ అడ్డంకులను దాటి రన్‌వే వద్దకు చేరుకుని, రన్‌వే సెంటర్‌లైన్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఇస్రో తెలిపింది.

ల్యాండ్ సమయంలో 320 kmph కంటే ఎక్కువగా వేగంతో ఉండగా, బ్రేక్ పారాచూట్‌,ల్యాండింగ్ గేర్ బ్రేక్‌లు, నోస్ వీల్ స్టీరింగ్‌ని ఉపయోగించి దాదాపు 100 kmphకి తగ్గించారు. రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ భారతదేశ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో పేర్కొంది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ, ఇస్రో పుష్పక్/పునర్వినియోగ లాంచ్ వెహికల్ హ్యాట్రిక్‌గా సురక్షిత ల్యాండింగ్‌లను సాధించింది. ఇప్పుడు ఇది పుష్పక్ కక్ష్య పరీక్షకు వేదికను సిద్ధం చేసింది. దీనిని రాకెట్‌లో అంతరిక్షంలోకి పంపిస్తాం. 21వ శతాబ్దంలో స్వదేశీ పద్ధతిలో పునర్వినియోగపరచదగిన రాకెట్లను ఉపయోగించేందుకు ఇస్రో చేసిన ప్రత్యేకమైన ఆత్మనిర్భర్ ప్రయత్నంగా పుష్పక్ నిలుస్తుందని అన్నారు.

ఈ విమానంలో రాడార్ ఆల్టిమీటర్, ఫ్లష్ ఎయిర్ డేటా సిస్టమ్, సూడోలైట్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక సెన్సార్‌లు ఉన్నాయి. ముఖ్యంగా, RLV-LEX-03 మిషన్ దాని పాత LEX-02 మాదిరిగా రెక్కల శరీరం, విమాన వ్యవస్థలను ఎలాంటి మార్పు లేకుండా తిరిగి ఉపయోగించారు, దీంతో బహుళ ఆపరేషన్లను నిర్వహించనున్నారు.


Similar News