Air Force Anniversary : థోయిసే టు తవాంగ్.. 7వేల కి.మీ సుదీర్ఘ కార్ల ర్యాలీ.. ఎందుకంటే..

దిశ, నేషనల్ బ్యూరో : భారత వాయుసేన 92వ వార్షికోత్సవం అక్టోబరు 8న జరగబోతోంది.

Update: 2024-09-28 19:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత వాయుసేన 92వ వార్షికోత్సవం అక్టోబరు 8న జరగబోతోంది. ఈసందర్భంగా ఆ రోజున 7వేల కి.మీ సుదీర్ఘ కార్ల ర్యాలీ లడఖ్‌లోని థోయిసే గ్రామంలో ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ థోయిసే గ్రామం పరిధిలోనే ఉంది. సముద్ర మట్టానికి 3,068 మీటర్ల ఎత్తులో ఇక్కడి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంటుంది. థోయిసే నుంచి ప్రారంభం కానున్న కార్ల ర్యాలీకి ‘వాయు వీర్ విజేత’ అని పేరు పెట్టనున్నారు. భారత వాయుసేన చరిత్ర, యుద్ధ సమయాల్లో సాధించిన విజయాలు, రెస్క్యూ ఆపరేషన్లలో ప్రజలను ఆదుకున్న తీరు, వాయుసేనలో యువతకు ఉద్యోగావకాశాలు వంటి అంశాలపై ప్రచారం చేయడమే ఈ కార్ల ర్యాలీ ముఖ్య ఉద్దేశం.

వాస్తవానికి ఈ ర్యాలీని అక్టోబరు 1వ తేదీనే నేషనల్ వార్ మెమోరియల్‌ వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. వార్ మెమోరియల్ నుంచి ఈ ర్యాలీ థోయిసే ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి అక్టోబరు 8న మొదలయ్యే కార్ల ర్యాలీ అక్టోబరు 29న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ముగుస్తుంది. ఈక్రమంలో మార్గం మధ్యలో 16చోట్ల ర్యాలీ ఆగుతుంది. కాలేజీ, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు, యువతకు భారత వాయుసేన సేవల గురించి వివరిస్తారు. ఈవివరాలను భారత రక్షణశాఖ శనివారం వెల్లడించింది.


Similar News