'పీవోకేలో ఎన్నికల నిర్వహణ క్లిష్టమైన ప్రక్రియే'

Update: 2023-12-23 10:33 GMT

చెన్నై : ‘‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) మనదే అయినా.. అక్కడ ఎన్నికల నిర్వహణ క్లిష్టతరమైన ప్రక్రియే’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌‌కు 24 అసెంబ్లీ సీట్లను రిజర్వ్‌ చేశామని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించడంతో దానిపై మన సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటించినట్లు అయిందన్నారు. ఈ ప్రకటన ద్వారా పీవోకే విషయంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టి సందేశాన్ని పంపిందన్నారు. చెన్నైలో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైశంకర్‌ పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ద్వంద్వ పౌరసత్వం అంశాన్ని కూడా జైశంకర్‌ ప్రస్తావించారు. ‘‘విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించడం అనేది సవాళ్లతో కూడిన సమస్య. దాన్ని కల్పించాలంటే ఆర్థిక, భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ డిమాండ్‌ను పరిష్కరించేందుకు ‘ఓవర్సీస్‌ సిటిజెన్‌షిప్‌ ఆఫ్ ఇండియా’ అనే అవకాశం ఉన్నా.. అది ఇంకా చర్చల దశలోనే ఉంది’’ అని విదేశాంగ మంత్రి తెలిపారు.


Similar News