ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై దాడి.. దుండగులు ఏం చేశారంటే..

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు.

Update: 2024-06-27 18:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటి బయట గేటుకు అమర్చి ఉన్న నేమ్ ప్లేటుపై నల్ల సిరాను రుద్దారు. ‘భారత్ మాతా కీ జై’, ‘ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్’, ‘అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’ అనే మూడు నినాదాలతో ఓ పోస్టరును గేటుకు తగిలించారు. పోస్టరుపై ఒవైసీ ఫొటో, భారత్ -ఇజ్రాయెల్ స్నేహాన్ని అద్దంపట్టే ఫొటోలు ఉన్నాయి. ఈ ఘటనపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘‘నన్ను నేరుగా ఎదుర్కోలేని కొందరు పిరికిపందలు ఢిల్లీలోని నా ఇంటిపై మరోసారి దాడి చేశారు. నా నేమ్ ప్లేటుపై సిరా చల్లి.. ఇంటిపైకి రాళ్లు విసిరి పారిపోవడం ధైర్యమున్న వాళ్లు చేసే పనికాదు. సావర్కర్ తరహా పిరికి ప్రవర్తనను ఆపి, నన్ను నేరుగా ఎదుర్కోండి’’ అని అసదుద్దీన్ సవాల్ విసిరారు.

ఢిల్లీలోని తన ఇంటిపై ఇప్పటిదాకా ఎన్నోసార్లు ఈవిధంగా దాడి జరిగిందన్నారు. తన ట్వీట్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాలను ట్యాగ్ చేశారు. దేశ రాజధానిలో ఎంపీలకు లభించే భద్రత ఇదేనా అని స్పీకర్‌ను ఒవైసీ ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వైఫల్యం వల్లే ఢిల్లీలోని తన ఇంటిపై ఈవిధంగా దాడులు జరుగుతున్నాయన్నారు. కాగా, ఇటీవల ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేస్తూ అసదుద్దీన్ ఒవైసీ ‘జై పాలస్తీనా’ నినాదం చేశారు. ఈనేపథ్యంలోనే ఆయన ఢిల్లీ నివాసంపై దాడి జరిగిందని ఆ పోస్టర్లపై ఉన్న సమాచారాన్ని బట్టి స్పష్టమవుతోంది.

Similar News