వీలునామా మార్చిన వారెన్ బఫెట్.. చనిపోయాక ఆ ఆస్తి అంతా ఎవరికంటే?

బెర్క్‌షైర్‌ హాత్‌వే అధినేత వారెన్‌ బఫెట్‌ తన వీలునామాలో మార్పులు చేశారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బఫెట్ బిల్ గేట్స్ ఫౌండేషన్ కు భూరి విరాళాలు ఇస్తున్నారు.

Update: 2024-06-30 10:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బెర్క్‌షైర్‌ హాత్‌వే అధినేత వారెన్‌ బఫెట్‌ తన వీలునామాలో మార్పులు చేశారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బఫెట్ బిల్ గేట్స్ ఫౌండేషన్ కు భూరి విరాళాలు ఇస్తున్నారు. అయితే, తాను చనిపోయాక అది ఉండదని చెప్పారు. ఇటీవల కూడా కోట్ల రూపాయల విలువైన షేర్లను బిల్ గేట్స్ ఫౌండేషన్ కు ఆయన కేటాయించారు. కాకపోతే, మార్చిన వీలునామా ప్రకారం.. తన మరణం తర్వాత అవి తన ముగ్గురు కుమారులకు దక్కనున్నట్లు తెలిపారు. ‘‘నా మరణం తర్వాత బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళాలు అందవు. నా పిల్లలకే ఆ డబ్బులు దక్కుతాయి. వాటిని వినియోగించే సామర్థ్యం ఉందని నమ్ముతున్నా” అని వారెన్‌ బఫెట్‌ తన వీలునామాలో పేర్కొన్నారు. ఇప్పటికే తన ముగ్గురు కుమారులు వేర్వేరు దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన మరణానంతరం ఆ వారసత్వాన్ని కొనసాగిస్తారని అన్నారు.

సంపదలో 99 శాతం దాతృత్వానికే..

సంపదలో 99శాతం దాతృత్వానికే కేటాయించినట్లు బఫెట్ గతంలో తెలిపారు. తన కుటుంబానికి చెందిన నాలుగు దాతృత్వ సంస్థలతో పాటు బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళాలు ఇస్తున్నారు. అయితే, ఇప్పటికే చాలాసార్లు తన వీలునామాను బఫెట్ మార్చారు. ఇక, ప్రస్తుతానికి మాత్రం గేట్స్ ఫౌండేషన్ కు విరాళాలు కొనసాగుతాయన్నారు. కాగా.. వారెన్ బఫెట్ సంపద విలువ సుమారు 130 బిలియన్ డాలర్లుగా ఉంది.

Similar News