సిద్ధు మూసేవాలా తరహాలో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా.. ఈ కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి.

Update: 2024-07-02 08:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా.. ఈ కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. సిద్ధూ మూసేవాలా తరహాలో సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారని ముంబై పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ని చంపేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు తెలిపారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని అందులో పేర్కొన్నారు. ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని అందులో తెలిపారు.

హత్య కోసం అధునాతన ఆయుధాలు

సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు ఆయుధాల కొనుగోలుకు కూడా ప్లాన్ చేశారని ఛార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నిందితుల ముఠా ఏకే-47, ఏకే-92, ఎం16 తుపాకులు సహా హై-కాలిబర్‌ ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ముఠా ప్రయత్నించిందని తెలిపారు. అంతేకాదు 2022లో పంజాబ్‌ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్‌’తో నటుడిని హత్య చేయాలని ముఠా భావించినట్టు దర్యాప్తులో బయటపడింది. సల్మాన్‌ ఫామ్‌హౌస్‌ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్‌ ప్రదేశాల్లో అటాక్ చేయాలని ప్లాన్ చేసినట్లు అధికారులు తేల్చారు. బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ.. నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా.. ఈ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్, అతని సోదరుడు అర్బాజ్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు.

Similar News