హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 6 మంది అరెస్ట్

హత్రాస్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-07-04 10:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హత్రాస్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురువారం ఈ ఘటనకు సంబంధించి 6 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. అయితే మత సమ్మేళనంలో ముఖ్య నిర్వహాకుడిగా ఉన్న ప్రధాన నిందితుడు ప్రకాష్ మధుకర్‌ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతన్ని పట్టించిన వారికి లక్ష రూపాయల బహుమతిని అందిస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, హత్రాస్ తొక్కిసలాటలో అందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ తెలిపారు. చివరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వీడియో కాల్ ద్వారా గుర్తించారు, దీంతో వారు అలీఘర్ ఆసుపత్రికి వెళ్లారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ప్రకటించింది. హత్రాస్ తొక్కిసలాటపై సికిందరావు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. దానిలో మధుకర్, ఇతర నిర్వాహకులను నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల న్యాయ కమీషన్‌ను ఏర్పాటు చేసింది.


Similar News