South korea: దక్షిణ కొరియాలో రెండో రోజూ భారీగా మంచు.. ఐదుగురు మృతి
దక్షిణ కొరియాలో వరుసగా రెండో రోజూ మంచు తుపాను భీభత్సం సృష్టించింది. భారీ హిమపాతం కారణంగా జనజీవనం స్థంబించిపోయింది.
దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ కొరియా(South korea)లో వరుసగా రెండో రోజూ మంచు తుపాను భీభత్సం సృష్టించింది. భారీ హిమపాతం (Heavy snow fall) కారణంగా జనజీవనం స్థంబించిపోయింది. గురువారం ఉదయం సియోల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 16 అంగుళాల కంటే ఎక్కువ మంచు పేరుకుపోయింది. దీంతో అధికారులు 140 విమానాలను రద్దు చేశారు. అలాగే 76 బోట్లను సైతం క్యాన్సిల్ చేశారు. మంచు భారీగా ఉన్నప్పటికీ అధికారులు నగరంలోని మెట్రోపాలిటన్ ప్రాంతంలో హెచ్చరికలను ఎత్తివేశారు. సియోల్‌కు ఆనుకుని ఉన్న జియోంగ్గీ ప్రావిన్స్‌లో మంచు కురుస్తున్న కారణంగా ఐదుగురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మంచు బరువు కారణంగా ఓ నిర్మాణం కూలిపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మంచుతో నిండిన రోడ్డుపై బస్సు జారిపడటంతో మరొకరు మరణించినట్టు తెలిపారు.
భారీ హిమపాతం కారణంగా, సియోల్ ప్రధాన విమానాశ్రయం (Airport) ఎక్కువగా ప్రభావితమైంది. విమానాలు ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 31 శాతం విమానాలు ఆలస్యం కాగా 16 శాతం విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. జియోంగ్గి ప్రావిన్స్‌లో 1,285 పాఠశాలలు మూసివేశారు. మరోవైపు దక్షిణ కొరియా పొరుగున ఉన్న ఉత్తర కొరియాలోని కొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో 4 అంగుళాల వరకు మంచు కురిసినట్టు కొరియన్ సెంట్రల్ టెలివిజన్ తెలిపింది. కాగా, 1907 తర్వాత సియోల్‌లో ఇది మూడో అతి పెద్ద హిమపాతం కావడం గమనార్హం.