జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణం చేశారు. రాంచీలోని రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Update: 2024-07-04 11:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణం చేశారు. గురువారం సాయంత్రం రాంచీలోని రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భూకుంభకోణం కేసులో ఐదు నెలల తర్వాత బెయిల్ పై విడుదలైన ఆయన.. మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం తర్వాత హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా 'మహాఘట్ బంధన్' ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసిందన్నారు. రాజకీయ ఒడిదొడుకులు ఎదురయ్యి.. తాను జైలులో ఉన్నానని అన్నారు. ఆ సమయంలో చంపై సోరైన్ అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. కోర్టు ఆదేశం కారణంగా తాను బయటకు వచ్చానని అన్నారు. ఇకపోతే, సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం జులై 8న విశ్వాసపరీక్ష ఎదుర్కోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరగనుంది.

గవర్నర్ ఏమన్నారంటే?

కొత్త ప్రభుత్వం పేదల సమస్యలను పరిష్కరిస్తుందని జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. "మేము రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం. మనమందరం పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలి. కొత్త ప్రభుత్వం నుండి నేను ఆశిస్తున్నది ఇదే" అని గవర్నర్ అన్నారు. హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ మీడియాతో మాట్లాడారు. హేమంత్ రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తూనే ఉంటారని అన్నారు."హైకోర్టు ఆదేశాల తర్వాత హేమంత్ సోరెన్ మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పటిలాగే ప్రజల కోసం పని చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మాకు సమయం తక్కువ ఉంది" అని కల్పనా సోరెన్ అన్నారు.

చంపై సోరెన్ రాజీనామా

భూకుంభకోణం కేసులో అరెస్టయిన సోరెన్ ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో, ఇన్నిరోజులు సీఎంగా కొనసాగిన చంపై సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన కొన్నిగంటల వ్యవధిలోనే హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చంపై రాజీనామా తర్వాత ఆయన నివాసంలోనే.. జేఎంఎం ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్ సోరెన్ ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ని కోరారు. గవర్నర్ ఆమోదంతో.. సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం స్వీకారం చేశారు.

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన హేమంత్

జనవరి 31న భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు హేమంత్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. ఆయన వారసుడిగా ఫిబ్రవరి 2న చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవలే హేమంత్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయిదు నెలల తర్వాత జూన్‌ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. మరోవైపు, కేబినేట్ లో మార్పులు ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గంలో హేమంత్ భార్య కల్పనా సోరెన్ కు చోటుదక్కనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Similar News