కేరళలో నాలుగు వ్యాధుల కలకలం

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ రాష్ట్రాన్ని ఇప్పుడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు వ్యాధులు వణికిస్తున్నాయి.

Update: 2024-07-06 19:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ రాష్ట్రాన్ని ఇప్పుడు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు వ్యాధులు వణికిస్తున్నాయి. అవి.. బ్రెయిన్ ఈటింగ్ వ్యాధి ‘పీఏఎం’, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ . బ్రెయిన్ ఈటింగ్ వ్యాధితో కోజికోడ్‌లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ‘నయెగ్లేరియా ఫౌలేరీ’ అనే అమీబా మనిషి మెదడును తినగలదు. దీనివల్ల మెదడుకు సోకే ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌ను ప్రైమరీ అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్ (పీఏఎం) అని పిలుస్తారు. పీఏఎం బారినపడి కోజికోడ్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు చనిపోయాడు. చెరువులో స్నానం చేసి వచ్చిన తర్వాత అతడికి ఈ అమీబా సోకిందని వైద్యులు గుర్తించారు. ఇదే వ్యాధితో కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఐదేళ్ల బాలిక చికిత్స పొందుతోంది. కేరళలో ఇప్పటివరకు నమోదైన పీఏఎం కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. కోజికోడ్‌లో గత రెండు నెలల్లోనే ఈ అరుదైన ఇన్ఫెక్షన్ తో ముగ్గురు చనిపోవడం గమనార్హం. పీఏఎం కారణంగా మే 21న కేరళలోని మలప్పురంలో ఐదేళ్ల బాలిక చనిపోయింది. జూన్ 12న కన్నూరుకు చెందిన 13 ఏళ్ల బాలిక పీఏఎంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యాధి చెరువులు, స్విమ్మింగ్ పూల్స్ నుంచి ప్రబలుతున్న నేపథ్యంలో వాటిలో క్లోరినేషన్ చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్విమ్మింగ్ చేసేటప్పుడు నోస్ క్లిప్‌లను వాడటం వల్ల ఈ ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ పొందొచ్చంటూ మార్గదర్శకాలు జారీ చేశారు.

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే వ్యాధి కూడా కేరళలో కలకలం రేపుతోంది. త్రిసూర్ జిల్లా మడక్కత్తర గ్రామంలో వందలాది పందులకు ఈ వ్యాధి సోకిందని గుర్తించారు. వాటి నుంచి మిగతా పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ప్రబలకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల పరిధిలో పంది మాంసం పంపిణీని నిలిపివేశారు. ఈ వ్యాధి బారినపడిన పందులను చంపే ప్రక్రియ మొదలైంది. వెలుగుచూశాయి.

డెంగ్యూ

కేరళలో డెంగ్యూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత ఐదు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 493 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి. డెంగీ కారణంగా ముగ్గురు చనిపోయారు. శుక్రవారం ఒక్కరోజే 109 మందికి డెంగ్యూ జ్వరం నిర్ధారణ అయింది. ఎర్నాకులంలో అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈవివరాలను కేరళ ఆరోగ్యశాఖ కూడా శనివారం ధ్రువీకరించింది. మే నెలలోనూ రాష్ట్రంలో 1150 మందికి డెంగ్యూ సోకిందని చెప్పింది.

స్వైన్ ఫ్లూ

గత ఐదు రోజుల్లో రాష్ట్రంలోని 158 మందికి స్వైన్ ఫ్లూ (హెచ్‌1ఎన్1) నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గత ఐదు రోజుల్లో దాదాపు 70వేల మంది జ్వర లక్షణాలతో చికిత్స పొందారని పేర్కొంది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, పతనంతిట్ట, త్రిసూర్ జిల్లాల్లో కూడా జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని వెల్లడించింది.


Similar News