రికార్డు స్థాయిలో రూ.1.27 లక్షల కోట్లకు భారతదేశ రక్షణ ఉత్పత్తులు

గత కొన్నేళ్ల నుంచి భారత్ స్థానికంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీని భారీగా పెంచుతుంది.

Update: 2024-09-25 12:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్నేళ్ల నుంచి భారత్ స్థానికంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీని భారీగా పెంచుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఉత్పత్తులు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ప్రకటించారు. 'మేక్ ఇన్ ఇండియా' 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానిస్తూ, 2023-24లో భారతదేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ. 1.27 లక్షల కోట్లకు చేరుకుంది. భారత దేశ సాయుధ దళాలు ఇప్పుడు సొంత గడ్డపై స్థానికంగా తయారైన ఆయుధాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. మన అవసరాలకు పోను ఇతర దేశాలకు సైతం సైనిక ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం భారత్ 90కి పైగా స్నేహపూర్వక దేశాలకు ఆయుధాలు, సైనిక ఉత్పత్తులకు సంబంధించిన హార్డ్‌వేర్‌లను ఎగుమతి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ప్రారంభమైన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ద్వారా భారత్‌లో తయారీ భారీగా పెరిగింది. ప్రపంచ రక్షణ పారిశ్రామిక రంగంలో దేశం అభివృద్ధి చెందుతోంది, మోడీ నాయకత్వం, ప్రతి రంగంలో కూడా భారత్‌ను స్వావలంబన దేశంగా మార్చాలనే ధృడ సంకల్పంతో ఇది సాధ్యమైందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గత పదేళ్ల నుంచి రక్షణ రంగంతో సహా ప్రతి రంగంలోనూ అనేక సంస్కరణలు చేపట్టాం, ప్రపంచంలోని రక్షణ పారిశ్రామిక రంగంలో భారత్‌ దూసుకుపోతోందని మంత్రి తెలిపారు.

ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉండగా, క్రమంగా దేశీయ రక్షణ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోంది. దేశీయ రక్షణ తయారీని పెంపొందించడం, ముఖ్యంగా చైనా సరిహద్దు ప్రాంతాల్లో సైనిక సంసిద్ధతను పెంపొందించడంపై కేంద్రం దృష్టి సారించింది. భారతదేశ రక్షణ ఎగుమతులు 2023-24లో మొదటిసారిగా రూ.21,000 కోట్ల మార్కును అధిగమించాయి. రాబోయే ఐదేళ్లలో దీనిని రూ.50,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ రాబోయే ఐదేళ్లలో రక్షణ తయారీలో $25 బిలియన్ల ( రూ.1.75 లక్షల కోట్ల) టర్నోవర్‌ని లక్ష్యంగా పెట్టుకుంది .


Similar News