Bengalur case: తోటి ఉద్యోగే నిందితుడు.. బెంగళూరు మహిళ హత్య కేసులో సంచలన విషయాలు!

బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-09-25 13:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 21న బెంగళూరులోని వయాలికేవల్ ప్రాంతంలో మహాలక్ష్మి అనే మహిళను హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళ మృత దేహాన్ని 59 ముక్కలుగా నరికినట్టు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మహాలక్ష్మితో కలిసి పని చేసిన ముక్తి రంజన్ రాయ్ అనే సహోద్యోగిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. నిందితుడు ఒడిశాకు చెందినవాడని, హత్య అనంతరం పారిపోయే ముందు బెంగళూరులో నివసించేవారని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ధ్రువీకరించారు. మహాలక్ష్మితో పనిచేసిన ముక్తి, మరొక వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయాడని ఈ క్రమంలోనే హత్యకు కుట్ర పన్ని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం ముక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో దాగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆయనను పట్టుకోవడానికి సోదాలు నిర్వహిస్తున్నారు. రిఫ్రిజిరేటర్‌లో లభించిన వేలిముద్రలను కూడా ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు మహాలక్ష్మితో విడిపోయిన భర్త హేమంత్ ఉత్తరాఖండ్‌కు చెందిన అష్రఫ్ అనే వ్యక్తితో మహాలక్ష్మికి సంబంధం ఉందని చెప్పారు. అయితే అష్రఫ్‌ ప్రధాన నిందితుడు కాదని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతున్నట్టు వెల్లడించారు. 


Similar News