Jharkhand: రాజకీయ కుట్రతో భద్రతా వాహనాలను ఉపసంహరించారు: చంపై సోరెన్

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-09-25 13:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం తనకు కేటాయించిన అన్ని భద్రతా వాహనాలను ఉపసంహరించుకుందని అన్నారు. ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ కుట్రలో భాగంగా ప్రభుత్వం నా ప్రాణాలను పణంగా పెట్టి నాకు కేటాయించిన అన్ని భద్రతా వాహనాలను ఉపసంహరించుకుంది. ఇలాంటి చర్యలకు నేను ఎప్పుడు కూడా భయపడను, జార్ఖండ్ ప్రజలు నాకు రక్షణ కల్పిస్తారని పేర్కొన్నారు. విలువలతో తాను ఎప్పుడూ రాజీ పడలేదు, ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని చంపై సోరెన్ చెప్పారు.

ఇదే సమావేశంలో జార్ఖండ్‌లో రాజకీయ నేతలను బీజేపీ కొనుగోలు చేసింది అని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యల గురించి ఒక విలేకరి ప్రశ్నించగా, దానికి ఆయన బదులిస్తూ, నన్ను ఎవరూ కొనడానికి సాహసించలేరు. జేఎంఎం చంపై సోరెన్‌ను అవమానించింది. పార్టీలో గౌరవం లేకపోవడం వలనే దానిని వీడినట్లు స్పష్టంగా చెబుతున్నా అని అన్నారు. హేమంత్‌ సోరెన్‌ జైలులో ఉన్న సమయంలో చంపై సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైన వెంటనే బాధ్యతలు కాస్త తిరిగి హేమంత్‌ సోరెన్‌ చేతుల్లోకి వెళ్లాయి. దీంతో చంపై సోరెన్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ సీనియర్‌ నాయకుల సమక్షంలో కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.


Similar News