Sonu Sood : సీఎం పదవిని ఆఫర్ చేస్తే.. వద్దని చెప్పా : సోనూ సూద్
దిశ, నేషనల్ బ్యూరో : జనం మెచ్చే సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్(Sonu Sood) కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : జనం మెచ్చే సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్(Sonu Sood) కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇటీవలే పలు పొలిటికల్ ఆఫర్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. ‘‘నన్ను పిలిచి సీఎం పదవిని(CM post), డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారు. కనీసం రాజ్యసభ సీటునైనా తీసుకొమ్మని చెప్పారు. అయితే నేను వాటన్నింటికి నో చెప్పాను’’ అని సోనూ సూద్ వెల్లడించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో నాకు అంత పెద్ద ఆఫర్లు రావడాన్ని చూసి సంతోషం కలిగింది. ఈ ప్రపంచాన్ని మార్చేందుకు నాకు అవకాశాన్ని కల్పిస్తామని చెప్పినందుకు గర్వంగా అనిపించింది’’ అని సోనూ చెప్పుకొచ్చారు.
‘‘రాజకీయాల్లోకి వెళ్లాలని నేనైతే అనుకోవడం లేదు. వాటిలోకి వెళితే నా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. స్వేచ్ఛను కోల్పోకుండా ప్రజలకు దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘కొంతమంది డబ్బు కోసం.. ఇంకొంతమంది అధికారం కోసం రాజకీయాల్లోకి చేరుతుంటారు. ప్రజలకు సాయం చేయడమే రాజకీయం అని భావిస్తే.. నేను ఇప్పటికే ఆ పనిలో ఉన్నాను. రాజకీయ అవకాశాలు ఇవ్వమని నేను ఎవరినీ అడగలేదు. రాజకీయాల్లో చేరి ఎవరికో జవాబుదారీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు’’ అని సోనూ సూద్ స్పష్టం చేశారు. కాగా, సోనూ సూద్ సోదరి మాలవిక సూద్ 2022 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్‌లోని మోగా నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే అక్కడి నుంచి ఆప్ అభ్యర్థిని అమన్ దీప్ కౌర్ అరోరా గెలిచారు.