'అఖిలపక్ష సమావేశం.. అన్ని పార్టీలను ఆహ్వానించిన కేంద్రం'

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 (గురువారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.

Update: 2023-07-18 16:10 GMT

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 (గురువారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. వర్షాకాల సమావేశాలకు సంబంధించిన పలు అంశాలపై ఇందులో చర్చించనుంది. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయా పార్టీలను స్పీకర్ కోరనున్నారు. మంగళవారం రాజ్యసభ చైర్ పర్సన్ జగదీప్ ధన్కడ్ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా, ఢిల్లీలో ఎన్డీయే పార్టీల మీటింగ్, బెంగళూరులో విపక్ష కూటమి సమావేశం నేపథ్యంలో ఎవరూ రాలేకపోయారు. దీంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు వెల్లడించారు.

ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు.. వచ్చే నెల 11వరకు జరగనున్న విషయం తెలిసిందే. నూతన పార్లమెంటు భవనానికి తుది మెరుగులు దిద్దాల్సి ఉన్న నేపథ్యంలో వర్షకాల సమావేశాలు పాత భవనంలోనే ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి వెల్లడించారు. ఎప్పటిలానే, ఈ సమావేశాలు సైతం వాడివేడిగా జరగనున్నట్టు తెలుస్తోంది. మణిపూర్ హింస, కూరగాయాలు సహా నిత్యవసరాల ధరల పెరుగుదలతోపాటు దేశంలో నెలకొన్న ఇతర సమస్యలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించనున్నాయి. మరోవైపు, ఉమ్మడి పౌరస్మృతి, డిజిటల్ ప్రైవసీ డేటా ప్రొటెక్షన్ సహా పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది.


Similar News