సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడ్డ బస్సు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-06-21 06:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ) బస్సు బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్, ఒక మహిళ, నేపాలీ జాతీయుడు ఉన్నారు. తెల్లవారుజామున జుబ్బల్ కుడు నుండి గిల్తారీకి వెళ్తున్న హెచ్‌ఆర్‌టీసీ బస్సు గిల్తారి సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా బోల్తా పడింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌, కండక్టర్‌తో సహా మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చుట్టుపక్కల వారు బస్సు వద్దకు చేరుకుని లోపల చిక్కుకున్న వారిని బయటకు తీశారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రిలో జాయిన్ చేయగా, చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న జుబ్బల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) రాజీవ్ శంఖాయన్ మాట్లాడుతూ, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మరో ముగ్గురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిమ్లా సంజీవ్ గాంధీ మాట్లాడుతూ, పోలీసులు దీనిపై పూర్తి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలకు సమాచారం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Similar News