H1B visa row: ద్వేషపూరిత జాత్యాహంకారులను తొలగించాలి- మస్క్
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) క్యాంపులో విభేదాలు తలెత్తాయి. హెచ్1 బీ (H1B Visa) వీసాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) క్యాంపులో విభేదాలు తలెత్తాయి. హెచ్1 బీ (H1B Visa) వీసాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తుంటే.. ఇతరులు మాత్రం అమెరికా ఫస్ట్ అనే నిబంధనకు కట్టుబడి ఉన్నారు. భారతీయ అమెరికన్లతో రిపబ్లిక్ పార్టీ 'భిన్నంగా' వ్యవహరిస్తోందని డెమొక్రాట్ ఆరోపించిన తర్వాత మస్క్ చేసిన పోస్టు వైరల్ గా మారింది. పార్టీలోని ద్వేషపూరిత జాత్యాహంకారులను, మూర్ఖులను తొలగించాలని డిమాండ్ చేశారు. హెచ్1 బీ (H-1B) వీసాపై అమెరికాకు వలస వచ్చిన మస్క్.. అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ ను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనను కొనసాగిస్తున్నారు. "మీ టీం ఛాంపియన్‌షిప్ గెలవాలని మీరు కోరుకుంటే.. టాప్ టాలెంట్ ఎక్కడున్నా రిక్రూట్ చేసుకోవాలి" అని మస్క్ చెప్పుకొచ్చారు.
ట్రంప్ పార్టీలో విభిన్న వాదనలు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా.. ఆయన కార్యవర్గంలో ఇప్పటికే ఐదుగురు భారత అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అయితే వారిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను ఎంచుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్‌కార్డుల విషయంలో ఉన్న పరిమితులను తొలగించాలని గతంలో శ్రీరామ్ పిలుపునిచ్చారు. దీనిపై ట్రంప్ మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మరోవైపు రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ భిన్నమైన వాదనను వినిపించారు. ‘‘నేను సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన సమయంలో నిరుద్యోగిత రేటు 11 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారు. సాంకేతికరంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తే ముందు విద్యారంగంపై దృష్టిసారించాలి. అంతేకానీ అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దు’’ అని స్పష్టంగా తన అభిప్రాయాన్ని వినిపించారు. ఈ నేపథ్యంలో మస్క్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు.