ED: కేంద్రమంత్రి సన్నిహితుడి నివాసంలో ఈడీ సోదాలు
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్(Union Minister Chirag Paswan) సన్నిహితుడు హులాస్ పాండే(Hulas Pandey) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు జరిగాయి.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్(Union Minister Chirag Paswan) సన్నిహితుడు హులాస్ పాండే(Hulas Pandey) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు జరిగాయి. లోక్ జనశక్తి పార్టీ (LJP) నాయకుడు హులాస్ పాండేకు చెందిన మూడు ప్రదేశాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. పాట్నా, బెంగళూరు, ఢిల్లీలో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పార్టీలోని ప్రముఖ బలమైన వ్యక్తి హులాస్ పాండే. కాగా.. ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రాగా.. వాటిపైనే ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. అయితే, ఏ కేసుతో సంబంధం ఉన్నది అనే విషయాలపై ఈడీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ముఖియా హత్య కేసులో..
హులాస్ పాండే లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు సన్నిహితుడు. ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ భాగంగా కాగ.. ఆహార శుద్ధి పరిశ్రమశాఖ మంత్రిగా చిరాగ్ పాశ్వాన్ పనిచేస్తున్నారు. మరోవైపు, 2012లో బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ప్రైవేట్ మిలీషియా రణవీర్ సేన వ్యవస్థాపకుడు బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఆ కేసులో పాండేను ప్రధాన సూత్రధారిగా పేర్కొంటు సీబీఐ ఛార్జిషీటులో పేర్కొంది. అయితే, పాండే తన రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోతారనే భయంతోనే ముఖియా హత్యకు కుట్ర పన్నారని సీబీఐ వెల్లడించింది. దీంతో 2023 డిసెంబర్‌లో పార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ ఛార్జిషీట్‌ను ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేయడంతో ఈ హత్య కేసులో ఆయనకు ఊరట దక్కింది. ఇకపోతే, పాండే ఎల్జేపీలో చేరకముందు నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ కోసం పనిచేశారు.