బెంగాల్ సర్కార్‌కు ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ..

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2023-07-24 17:07 GMT

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘రామనవమి హింస’ కేసు దర్యాప్తును ‘ఉగ్రవాద వ్యతిరేక సంస్థ’(ఎన్ఐఏ)కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. బెంగాల్ ప్రభుత్వం సవాలును తాము స్వీకరించబోమని వెల్లడించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. సదరు పిటిషన్‌ను మంగళవారం కొట్టివేసింది. కాగా, ఈ ఏడాది మార్చిలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో బెంగాల్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టడం, రాళ్లు రువ్వడం, దుకాణాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.

ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల వెనుక ఎవరున్నారనేదానిపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ నేత సువేంధు అధికారి కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేయగా, న్యాయస్థానం అందుకు అంగీకరించింది. హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ బెంగాల్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హింసలో పేలుడు ఘటనలేవీ జరగలేదని, ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలనుకోవడం రాజకీయ ప్రేరేపితమని పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్ర పోలీసులతోనే విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.


Similar News