రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను శుక్రవారం రిలీజ్ చేసింది. ఈ లిస్టులో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాష్ట్ర సీఎం భూపేశ్ భఘేల్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పార్టీ ఇన్ చార్జ్ కుమారి సెల్జా, సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి తదితరులు ఉన్నారు. వీరంతా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
కాగా, రాష్ట్రంలో నవంబర్ 7, 17న రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మొదటి లిస్టులో 30 మంది, సెకండ్ లిస్టులో 53 మందిని ఖరారు చేసింది. మరో 7 స్థానాలకు త్వరలోనే క్యాండిడేట్స్‌ను ప్రకటించనుంది. రైతులు, గిరిజనులు, పేదలపై దృష్టి సారించిన కాంగ్రెస్ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది.