మూడు Youtube ఛానల్స్‌పై కేంద్రం కఠిన నిర్ణయం
తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో పాటు పలువురు ప్రముఖులు, ప్రముఖ సంస్థలపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్న మూడు యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం బ్లాక్ చేసింది. 33 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు కలిగిన ఈ మూడు యూట్యూబ్ ఛానళ్లు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయని ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తమ దర్యాప్తులో తేల్చింది.
'న్యూస్ హెడ్ లైన్స్', 'సర్కారి అప్ డేట్', 'ఆజ్ తక్ లైవ్' పేరుతో నడుస్తున్న ఈ మూడు యూట్యూబ్ ఛానళ్లు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నాయని అంతే కాకుండా తమ కంటెంట్ లో వివిధ టీవీ ఛానెల్స్‌కు చెందిన లోగోలు మరియు ప్రముఖ న్యూస్ యాంకర్ల ఫోటోలను థంబ్ నెయిల్స్‌గా ఉపయోగించి తమ వీడియోలోని సమాచారం ప్రామాణికమైనదే అని నమ్మేలా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. పీఎం, సీజేఐతో పాటు ఎన్నికల సంఘం, ఈవీఎం ఓటింగ్ సిస్టమ్ గురించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న అనేక వీడియోలు ఈ ఛానల్స్ లో ఉన్నాయని, భవిష్యత్ లో ఎన్నికలు బ్యాలెట్ విధానం ద్వారానే జరుగుతాయని, బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం డబ్బు పంపిణీ చేస్తోందని చెబుతూ ఇలాంటి అనేక తప్పుడు సమాచారాలు ఇందులో ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ వీడియోలను 30 కోట్ల మందికిపైగా వీక్షించారని స్పష్టం చేసింది. ఫేక్ న్యూస్ ను అరికట్టడంలో భాగంగా ఇప్పటికే వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేస్తున్న ప్రభుత్వం తాజాగా పై మూడు ఛానళ్లను బ్లాక్ చేసింది.