Bulldozer Justice: బుల్డోజర్ కూల్చివేతలు అక్రమం

ఏదో ఒక కేసులో నిందితుడు లేదా దోషిగా ఉన్న వ్యక్తికి చెందిన నివాసాన్ని, ఆయన నేర చరిత్రను సాకుగా చూపి అధికారులు కూల్చివేయడాన్ని(Demolition) సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ‘బుల్డోజర్ జస్టిస్’(Bulldozer Justice) అక్రమం, రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేసింది.

Update: 2024-11-13 15:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఏదో ఒక కేసులో నిందితుడు లేదా దోషిగా ఉన్న వ్యక్తికి చెందిన నివాసాన్ని, ఆయన నేర చరిత్రను సాకుగా చూపి అధికారులు కూల్చివేయడాన్ని(Demolition) సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ‘బుల్డోజర్ జస్టిస్’(Bulldozer Justice) అక్రమం, రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేసింది. యూపీ(Uttar Pradesh), మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కీలక విషయాలను ప్రస్తావించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రత్యేకంగా గైడ్‌లైన్స్‌ కూడా విడుదల చేసింది. పబ్లిక్ ప్లేసెస్ అంటే రోడ్లు, వీధులు, ఫుట్‌పాత్‌లు, వాటర్ బాడీస్(చెరువులు, కుంటలు మొదలైనవి)లోని నిర్మాణాలకు ఈ గైడ్‌లైన్స్ వర్తించవని, ప్రత్యేకంగా న్యాయస్థానాల ఆదేశాలున్న కేసులకూ వర్తించవని వివరించింది.

నిందితుడు నేరం చేశాడా? లేదా? అనేది తేల్చాల్సింది న్యాయవ్యవస్థ అని, రాష్ట్ర అధికారులు నేరాన్ని నిర్దారించి, దోషిని నిర్ణయించి శిక్షగా ఆ వ్యక్తికి చెందిన నివాసాన్ని కూల్చివేయడం సరికాదని న్యాయమూర్తులు బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం ఓ కేసులో నిందితుడని.. ఆయన నివాసాన్ని కూల్చివేయడం రాజ్యాంగవ్యతిరేకమని తెలిపింది. రాజ్యాంగ విలువలు ఈ అధికార దుర్వినియోగాన్ని అంగీకరించవని, ఆ నిర్ణయాలు వారి అధికార పరిధికి మించినవని వివరించింది. కేసులో దోషిగా తేలినా సరే ఆయన నివాసాన్ని కూల్చే పని అధికారులు చేపట్టడం అక్రమమని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవడమే అవుతుందని పేర్కొంది. ఆర్టికల్ 21 కింద గూడును కలిగి ఉండే హక్కు పౌరుడికి ఉంటుంది. ఒక్కరు చేసిన నేరానికి ఇల్లు కూల్చేస్తే ఆ కుటుంబం సంఘటితంగా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. అదే విధంగా ఒక నివాసాన్ని కూల్చేసి మరో నిందితుడి నివాసాన్ని కూల్చేయకుంటే.. అందులో ఒకరినే శిక్షించాలనే ఉద్దేశ్యంతో నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుందని వివరించింది. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, చట్ట వ్యతిరేక చర్యల నుంచి పౌరులను రక్షించాలని తెలిపింది. రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమని వివరించింది. లేదంటే అది అరాజకానికి దారితీస్తుందని పేర్కొంది.

గైడ్‌లైన్స్ ఇవే:

1. కూల్చివేతకు ఆదేశాలు వస్తే దానిపై అప్పీల్ చేసే సమయాన్ని ఇవ్వాలి

2. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా కూల్చివేయరాదు. కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలి

3. ఆ నిర్మాణం ఉల్లంఘించిన నిబంధనలు, కూల్చివేత నిర్ణయానికి దోహదపడిన వివరాలు పేర్కొనాలి

4. నోటీసులు పంపిన తర్వాత జిల్లా కలెక్టర్‌కు సమాచారమివ్వాలి

5. కూల్చివేతకు కలెక్టర్ నోడల్ అధికారిని నియమిస్తారు

6. ఇలాంటి నోటీసులు, ఆర్డర్‌లు అందుబాటులో ఉంచడానికి ప్రత్యేకంగా ఓ డిజిటల్ పోర్టల్ ఉండాలి

7. సదరు నిర్మాణంలో కొద్ది భాగం లేదా పాక్షికంగా నిబంధనలు అతిక్రమిస్తే కూల్చివేతే సరైన నిర్ణయమా అని పరీక్షించుకోవాలి

8. 15 రోజుల్లో నిర్మాణాన్ని కూల్చివేసుకోవడానికి యజమానికి అవకాశమివ్వాలి

9. కూల్చివేత ప్రక్రియను వీడదియో తీయాలి. దాన్ని భద్రపరచాలి

10. కూల్చివేత నివేదికను సంబంధిత మున్సిపల్ కమిషనర్‌కు పంపాలి.

* ఈ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే సదరు అధికారులు కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది. కూల్చిన నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి ఆ ఉద్యోగుల జీతాలు కట్ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Tags:    

Similar News