త్రిపురలో 48 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా
వచ్చే నెలలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ శనివారం మొదటి దశ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
న్యూఢిల్లీ: వచ్చే నెలలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ శనివారం మొదటి దశ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో 48 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాషాయ పార్టీ వెల్లడించింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు అనిల్ బలుని, సంబిత్ పాత్రాలు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. సీఎం మాణిక్ సాహా బోర్దోవాలి నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతిమ భౌమిక్ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు.
త్రిపుర ఎంపీగా ఉన్న ఆమె ధన్‌పట్ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. శుక్రవారం ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలు సమావేశమై తుది జాబితాను ఖరారు చేశారు. మిగతా 12 మంది పేర్లను కూడా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30తో త్రిపురలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుండగా, ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు వెలువడునున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో 25 ఏళ్ల సీపీఎం పాలనకు ముగింపు పలుకుతూ బీజేపీ అధికారంలోకి వచ్చింది.