Bihar: బిహార్‌లో దారుణం.. దళితుల ఇళ్లకు నిప్పుపెట్టిన దుండగులు

బిహార్‌లోని నవాడా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భూవివాదం విషయంలో దళిత కాలనీలోని 21 ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు.

Update: 2024-09-19 07:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని నవాడా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భూవివాదం విషయంలో ఘర్షణ నెలకొనగా దళిత కాలనీలోని 21 ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో బుధవారం అర్దరాత్రి ఈ ఘటన జరిగింది. మొదట ప్రజలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని, అనంతరం నిప్పు పెట్టారని స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే ఇంట్లో ఉన్న వస్తువులు, పలు పశువులు కాలిపోయినట్టు తెలుస్తోంది. గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో భారీగా బలగాలను మోహరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు భూ వివాదమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రధాన నిందితుడితో సహా 10 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇతర నిందితులను సైతం త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

నిర్వాసితులకు ఆహార ప్యాకెట్లు, తాగునీరు సహా సహాయక సామగ్రిని అందిస్తున్నామని, బాధితుల కోసం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశామని నవాడా జిల్లా మేజిస్ట్రేట్ అశుతోష్ కుమార్ వర్మ తెలిపారు. ఈ ఘటన అనంతరం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ..దళితులపై జరుగుతున్న నేరాలను ఖండించారు. ఎన్డీఏ, దాని మిత్ర పక్షాలు నేరాలను నియంత్రించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వివాదం జరిగిందని మండిపడ్డారు. బీఎస్పీ చీఫ్ మాయవతి మాట్లాడుతూ..ఈ ఘటన చాలా బాధాకరమని తెలిపారు. బాధితులకు పునరావాసం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 


Similar News