Karnataka: కలసా-బండూరి ప్రాజెక్టు ఆమోదంపై ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం లేఖ

ప్రాజెక్ట్ కోసం వన్యప్రాణుల క్లియరెన్స్ పొందడంలో దీర్ఘకాల జాప్యం జరుగుతోందని సిద్ధరామయ్య లేఖలో పేర్కొన్నారు.

Update: 2024-09-19 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కర్ణాటక నీటి అవసరాలను తీర్చేందుకు కలసా-బండూరి తాగునీటి ప్రాజెక్టుకు తక్షణ ఆమోదం తెలపాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. లేఖలో ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను, అంతర్రాష్ట్ర సహకారం గురించి సిద్ధరామయ్య వివరించారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. 'ఉత్తర కర్ణాటక ప్రజల సంక్షేమానికి అవసరమైన కలసా-బండూరి ప్రాజెక్ట్‌కు త్వరితగతిన ఆమోదం తెలపాలని నేను  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాను. అంతర్రాష్ట్ర సహకారం ఈ ప్రాంత నీటి అవసరాలను తీర్చడంలో కీలకం, మన ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇద్దాం' అన్నారు. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి ప్రాజెక్ట్ కోసం వన్యప్రాణుల క్లియరెన్స్ పొందడంలో దీర్ఘకాల జాప్యం జరుగుతోందని సిద్ధరామయ్య లేఖలో పేర్కొన్నారు. చాలా కాలంగా ఈ క్లియరెన్స్ పెండింగ్‌లో ఉందన్నారు. మహాదాయి నీటి వివాద ట్రిబ్యునల్ 2018, ఆగస్టు 14న 13.42 టీఈంసీల నీటిని కర్ణాటకకు కేటాయిస్తూ, 3.9 టీఈంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించింది. 2022, జూన్ 16న సెంట్రల్ వాటర్ కమీషన్‌కు సమర్పించిన ఈ ప్రతిపాదన కావాల్సిన అన్ని అనుమతులను తీర్చిందని, అయితే ప్రధానమంత్రి అధ్యక్షతన గల నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీడబ్ల్యూఎల్) నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదని కూడా ముఖ్యమంత్రి ఎత్తి చూపారు. జాప్యం పట్ల నిరుత్సాహాన్ని లేఖలో వ్యక్తం చేశారు.

Tags:    

Similar News