Bhopal: భోపాల్ గ్యాస్ విషాదం.. కొనసాగుతున్న విష పదార్థాల తొలగింపు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న 337 మెట్రిక్ టన్నుల విషపూరిత రసాయన వ్యర్థాలు ధ్వంసం కానున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: భోపాల్ (Bhopal) గ్యాస్ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ (Union carbide Factory) ఆవరణలో ఉన్న 337 మెట్రిక్ టన్నుల విషపూరిత రసాయన వ్యర్థాలు ధ్వంసం కానున్నాయి. రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాగా చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. భారీ భద్రత మధ్య విషపూరిత రసాయన వ్యర్థాలతో కూడిన ట్రక్కులను ధార్‌లోని పితాంపూర్‌కు పంపిస్తున్నారు. ప్రక్రియ పూర్తైన అనంతరం అక్కడి ప్లాంట్‌లో రామ్‌కీ ఎన్విరో ఇంజినీరింగ్ కళాశాల ఇంజనీర్ల ఆధ్వర్యంలో దీనిని ధ్వంసం చేయనున్నారు. వ్యర్థాలను నిల్వ చేసేందుకు 12 లీక్ ప్రూఫ్ ఫైర్ రెసిస్టెంట్ కంటైనర్లను ఉపయోగిస్తున్నారు.
ఒక్కో కంటైనర్‌లో సగటున 30 టన్నుల వ్యర్థాలు నిల్వ చేయబడతాయి. 200 మందికి పైగా కూలీలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. పోలీసు వాహనాలు, అగ్నిమాపక దళాలతో పాటు 250 కిలోమీటర్ల పొడవైన గ్రీన్ కారిడార్ ద్వారా వీటిని రవాణా చేస్తున్నారు. భోపాల్‌కు చెందిన 50 మంది పోలీసులు కంటైనర్‌లకు ఎస్కార్ట్‌గా ఉన్నారు. ఈ మొత్తం ప్రక్రియ జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్, ఆరోగ్య శాఖ, కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణలో జరుగుతోంది. 37 టన్నుల వ్యర్థాలను పారవేయడానికి దాదాపు 153 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.