China's HMPV : చైనా హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన అవసరం లేదు : కేంద్ర ఆరోగ్య సంస్థ
చైనా(China)లో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాపి న్యూమో వైరస్ (HMPV Virus) పట్ల ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్(Director General of the Central Health Organization) డాక్టర్ అతుల్ గోయెల్ (Dr. Atul Goel) తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్ : చైనా(China)లో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాపి న్యూమో వైరస్ (HMPV Virus) పట్ల ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్(Director General of the Central Health Organization) డాక్టర్ అతుల్ గోయెల్ (Dr. Atul Goel) తెలిపారు. ఈ కొత్త వైరస్ దేశంలోకి ప్రవేశించలేదని చెప్పారు. అయితే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాను ప్రస్తుతం కొత్త వైరస్ హెచ్‌ఎంవీపీ వణికిస్తున్నది. ఆ దేశ ప్రజలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్ మీడియాతో మాట్లాడారు. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ పట్ల ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇప్పటి వరకు దేశంలో ఈ వైరస్ కేసు నమోదు కాలేదని తెలిపారు. కాగా, సాధారణ జలుబుకు కారణమయ్యే శ్వాసకోశ వైరస్ మాదిరిగానే హెచ్‌ఎంపీవీ ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధిపతి అయిన డాక్టర్ అతుల్ గోయెల్ తెలిపారు. ఈ వైరస్ వల్ల పిల్లలు, వృద్ధుల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.అయితే సాధారణంగా చలికాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి పెరుగుతుందని అన్నారు. మరోవైపు దగ్గు లేదా జలుబు వంటి లక్షణాలు ఉంటే, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అతుల్ గోయెల్ తెలిపారు. ఇతరులకు దూరంగా ఉండాలని సూచించారు.జలుబు లేదా జ్వరానికి సాధారణ మందులు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ఆసుపత్రులతోపాటు అత్యవసర వైద్య సామాగ్రిని సన్నద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనాలో కొవిడ్-19తో పాటు ఇన్‌ఫ్లుయెంజా-ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యూమోనియా వంటి వైరస్‌ల వ్యాపిస్తుండటంతో ఆ దేశ ప్రజలు పెద్ధ ఎత్తున ఆసుపత్రుల పాలవుతున్నారు.
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు ప్రకటించింది. రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్‌తో మీ చేతులను తరచుగా కడగాలని మార్గదర్శకాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు దగ్గరకి వెళ్లకూడదని అంటూ కొన్ని మార్గదర్శకాలను తెలంగాణ ఆరోగ్య శాఖ సూచించింది.
Read More: HMPV virus: చైనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన