Khalistani terrorist: మహా కుంభమేళాపై దాడి చేస్తాం.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హెచ్చరికలు
ఖలిస్థానీ ఉగ్రవాది(Khalistani terrorist), నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి బెదిరింపులకు దిగారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ ఉగ్రవాది(Khalistani terrorist), నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి బెదిరింపులకు దిగారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ‘‘మహా కుంభమేళా’’(Mahakumbh)పై దాడులు నిర్వహిస్తామని బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించడానికి, హిందుత్వాన్ని చంపడానికి ‘‘ప్రయాగ్‌రాజ్ ఛలో’’కి పిలుపునిచ్చాడు. లక్నో, ప్రయాగ్ రాజ్ ఎయిర్‌పోర్టుల్లో ఖలిస్థానీ, కశ్మీర్ జెండాలను ఎగురవేయాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. ‘‘మహాకుంభ్ ప్రయాగ్‌రాజ్ 2025 యుద్ధభూమిగా మారుతుంది’’ అని ప్రకటించారు. పది రోజుల వ్యవధిలో కుంభమేళాని టార్గెట్ చేస్తూ పన్నూ బెదిరించడం ఇది రెండోసారి. గతంలోనూ వీడియో రిలీజ్ చేశాడు. మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 29), బసంత్ పంచమి (ఫిబ్రవరి 3)తో సహా మతపరమైన ముఖ్యమైన పవిత్రస్నానాలు ఆచరించే రోజులను దెబ్బతీస్తామని హెచ్చరించాడు.
పన్నూపై ఆగ్రహం
పన్నూ వీడియోని అఖిల భారతీయ అఖాడా పరిషత్ తీవ్రంగా ఖండించింది. అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపూరి పన్నూ బెదిరింపులను తోసిపుచ్చాడు. అతడివి పిచ్చివాడి వ్యాఖ్యలుగా కొట్టిపారేశారు. ‘‘పన్నూ మహాకుంభమేళాలోకి ప్రవేశించడానికి ధైర్యం చేస్తే, అతడిని కొట్టి బయటకు పంపుతారు. ఇలాంటి పిచ్చివాళ్లను వందలాది మందిని చూశాం’’ అని అన్నారు. ఆయన హిందువులు, సిక్కుల మధ్య ఐక్యతను నొక్కిచెప్పారు. ఇది సిక్కులు, హిందువులు ఐక్యంగా ఉండే మహామేళ అని చెప్పుకొచ్చారు. విభజనను ప్రేరేపించడానికి పన్నూ చేసే ప్రయత్నాలు ఫలించవని అన్నారు. సనాతన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచింది సిక్కు సమాజం అని గుర్తుచేశారు. ఇకపోతే, పిలిభిత్‌లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ మిలిటెంట్లు హతమైన కొద్ది రోజుల తర్వాత ఈ బెదిరింపు వచ్చింది.