Delhi CM: రెండ్రోజుల తర్వాత పదవికి రాజీనామా చేస్తా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆరునెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. పార్టీ సమావేశం నిర్వహించారు. అందులోనే ఈ ప్రకటన చేశారు. ‘‘రెండు రోజుల తర్వాత నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ప్రజలు తీర్పు చెప్పే వరకు ఆ కుర్చీలో కూర్చోను. ఢిల్లీలో ఎన్నికలకు నెలరోజుల సమయం ఉంది. కోర్టు నుంచి నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజాకోర్టు నుంచి న్యాయం జరిగి ప్రజల ఆజ్ఞ మేరకే నేను సీఎం కుర్చీలో కూర్చుంటాను.” అని కేజ్రీవాల్ అన్నారు. తాను నిర్దోషినా లేదా దోషినా? అని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. తాను పని చేసి ఉంటేనే ఓటు వేయాలని కోరారు.
మోడీ సర్కార్ పై మండిపాటు
ఇకపోతే, ఢిల్లీకి కొత్త సీఎంని ఎన్నుకోవడానికి రాబోయే రెండ్రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత మరొకరు సీఎం అవుతారని కేజ్రీవాల్ చెప్పారు. ఆలోగా తాను ప్రజల వద్దకు వెళ్లి మద్దతు కోరతానన్నారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను(Delhi elections) మహారాష్ట్ర ఎన్నికలతో(Maharashtra elections) పాటు నవంబర్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి(Narendra Modi government) వ్యతిరేకంగా కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. బ్రిటీష్ వారి కంటే నియంతృత్వంగా పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేసినా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదన్నారు. " కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Kerala Chief Minister Pinarayi Vijayan), బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై(Bengal Chief Minister Mamata Banerjee). కేసులు పెట్టారు. నేను బీజేపీయేతర సీఎంలకు వారికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. మీపై కేసులు నమోదు చేస్తే రాజీనామా చేయవద్దు. ఇది వారి కొత్త గేమ్" అని కేజ్రీవాల్ అన్నారు.
ఆప్ అధినేతపై బీజేపీ విసుర్లు
కాగా.. కేజ్రీవాల్ షాకింగ్ ప్రకటనపై బీజేపీ నేత హరీశ్ ఖురానా(BJP's Harish Khurana) ఫైర్ అయ్యారు. ఆప్ అధినేత ఎందుకు డ్రామా సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. "48 గంటల తర్వాత ఎందుకు?.. ఈరోజే రాజీనామా చేయాలి.. గతంలో కూడా ఆయన ఇలాగే చేశారు.. సెక్రటేరియట్‌కి వెళ్లలేరు.. డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టుకోలేకపోతున్నారు.. అలాంటప్పుడు ఏం ప్రయోజనం?" అని అన్నారు. ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందా అని అడిగిన ప్రశ్నకు ఖురానా బదులిచ్చారు. "ఈరోజు అయినా, రేపు అయినా మేం పోటీకి సిద్ధంగా ఉన్నాం. 25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.