మావోయిస్టులకు అమిత్ షా డెడ్ లైన్

మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా డెడ్ లైన్ తో కూడిన వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-09-20 07:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా డెడ్ లైన్ తో కూడిన వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం వేళ అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు. దేశంలోని మావోయిస్టు తీవ్రవాదులంతా హింసను విడనాడాలని, ఆయుధాలను విడిచి పెట్టి లొంగిపోవాలని లేకపోతే పూర్తి స్థాయిలో నక్సల్ నిర్మూలన ఆపరేషన్​ను నిర్వహిస్తామని హెచ్చరించారు. నక్సలిజానికి వీడ్కోలు పలికేందుకు 2026 మార్చి 31 తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్​గఢ్ నక్సల్స్ బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో నక్సల్‌ హింసా సిద్ధాంతాలను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారని తెల్చిచెప్పారు. నక్సల్ సమస్య ఇప్పుడు ఛత్తీస్​గఢ్​లోని కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమైందని, మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయని చెప్పారు. ఛత్తీస్​గఢ్​లో నక్సల్​ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సంక్షేమ పథకాన్ని తీసుకురానుందని, దీని ద్వారా ఉద్యోగ, ఆరోగ్య, ఇతర రంగాలలో వారికి సహాయం చేస్తాం' అని అమిత్​ షా వెల్లడించారు. ఒకవైపు సెప్టెంబర్ 21న ఆవిర్భవించిన మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవాలను దేశ వ్యాప్తంగా ఈ నెల 21నుంచి ఆక్టోబర్ 20వరకు జరుపుకోవాలని ఆ పార్టీ పిలుపునిచ్చిన తరుణంలో అమిత్ షా డెడ్ లైన్ చర్చనీయాంశమెంది. నేపాల్​లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేసుకోవాలన్న నక్సల్స్ ఆశలకు గండికొట్టిన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారా ఇప్పటికే ఈ ఏడాది 160మంది నక్సల్స్ ను తుద ముట్టించింది. 


Similar News