AFSPA: ఆ రాష్ట్రాల్లో అఫ్సా చట్టం పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం

రెండు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం పొడిగించింది.

Update: 2024-09-26 07:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్సా)ను పొడిగించింది. శాంతి భద్రతలను సమీక్షించిన అనంతరం నాగాలాండ్‌లోని ఎనిమిది జిల్లాలు, అరుణాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో అఫ్సా చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టంలోని సెక్షన్ 3లో పొందుపర్చిన అధికారాలను ఉపయోగించి ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలిపింది. 2024 అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది.

నాగాలాండ్‌లోని ఎనిమిది జిల్లాలు, మరో ఐదు జిల్లాల్లోని 21 పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో అఫ్సా పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో దిమాపూర్, నియులాండ్, చుమౌకెడిమా, మోన్, కిఫిరే, నోక్లక్, ఫేక్, పెరెన్ జిల్లాలున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరాప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలతో పాటు అసోం సరిహద్దులోని నంసాయ్ జిల్లాలోని నంసాయ్, మహదేవ్‌పూర్, చౌకం పోలీస్ స్టేషన్ ప్రాంతాలను అఫ్సా అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.

కాగా, అఫ్సా చట్టం అనేది భారత సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలను మంజూరు చేస్తుంది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి ఉపయోగపడుతుంది. శాంతియుత పరిస్థితులను నెలకొల్పడానికి అవసరమైతే అరెస్టు చేయడం, కాల్పులు జరపడానికి విస్తృత అధికారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో ఈ చట్టం అమలుల్లో ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల్లోని 70 శాతం ప్రాంతాల్లో అఫ్సా తొలగించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో వెల్లడించారు.  


Similar News