ముంబైలో దారుణం.. ట్రాఫిక్ పోలీసును లాక్కెళ్లిన కారు డ్రైవర్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసును తన కారు బానెట్‌పై 20 కిలోమీటర్ల మేర లాక్కెళ్లిన తీరు కలకలం రేపుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసును తన కారు బానెట్‌పై 20 కిలోమీటర్ల మేర లాక్కెళ్లిన తీరు కలకలం రేపుతోంది. నవీ ముంబైలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కోపర్‌ఖెరాణె-వాశీ మార్గంలో బందోబస్తు నిర్వహిస్తున్న సిద్ధేశ్వర్ మాలి(37) అనే ట్రాఫిక్ పోలీసు, మరో పోలీసుతో కలిసి ఓ కారును అడ్డుకున్నారు. డ్రైవర్ డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానంతో వారిని ఆపారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా, కారు డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ముందున్న సిద్ధేశ్వర్ మాలి కారు బానెట్‌పై పడిపోయారు.
ఈ క్రమంలో డ్రైవర్ కారును ఆపకుండా వేగంగా నడిపాడు. కారును గట్టిగా పట్టుకొని ఉన్న ట్రాఫిక్ పోలీసు..20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవ్హాన్ ఫాటా ప్రాంతానికి చేరుకున్న తర్వాత కింద పడిపోయారు. ఇతర పోలీసులు ఆ కారును వెంబడించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. నిందితుడిని ఆదిత్య బెంబ్డే(22)గా గుర్తించారు. అతడు డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు వెల్లడించారు. అతడిపై మూడు ఐపీసీ సెక్షన్లు సహా మాదకద్రవ్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.