Praggnanandhaa: ప్రజ్ఞానందకు గ్రాండ్ వెల్‌కమ్.. సీఎం సత్కారం..

Praggnanandhaa rewarded with Rs 30 lakh by Tamil Nadu CM after warm welcome at Chennai airport

Update: 2023-08-30 14:22 GMT

చెన్నై: యువ చెస్ సంచలనం రమేష్ బాబు ప్రజ్ఞానందకు చెన్నైలో బుధవారం ఘన స్వాగతం లభించింది. ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం సాధించి జర్మనీ నుంచి వచ్చిన 18 ఏళ్ల చెస్ వీరుడికి రాష్ట్ర క్రీడా శాఖ అధికారులు, వేలాది మంది క్రీడాభిమానులు పుష్పగుచ్చాలు బహూకరించి, పూల కిరీటం, శాలువాతో సత్కరించారు. చెన్నై విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ జీపులో ఊరేగిస్తూ, మార్గంలో పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడిన చెన్నై వాసులు ప్రజ్ఞానందకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా తమిళనాడు జానపద నృత్యాలైన కరగట్టం, ఒయిలట్టమ్‌లను కళాకారులు ప్రదర్శించారు. లెజెండ్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్ ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద రికార్డు నెలకొల్పాడు. అజర్ బైజాన్‌లోని బాకులో జరిగిన ఈ టోర్నీలో 18 ఏళ్ల ఈ టీనేజ్ కుర్రాడు ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయినప్పటికీ అభిమానుల మనసు దోచుకున్నాడు. ప్రపంచ కప్‌లో టాప్-3లో నిలిచినందుకు ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌లో బెర్త్‌ను కూడా ఖరారు చేసుకున్నాడు. చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.

భారతీయుల అభిమానం చూరగొన్నాడు: స్టాలిన్

ప్రజ్ఞానంద నివాసానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా తాను సాధించిన రజత పతకాన్ని ప్రజ్ఞానంద చూపించాడు. ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినందుకు ప్రోత్సాహకంగా అతడికి సీఎం స్టాలిన్ రూ.30 లక్షల చెక్కును, మెమొంటోను అందజేశారు. ఫైనల్లో ఓడిపోయినప్పటికీ ప్రజ్ఞానంద సాధించిన విజయం 140 కోట్ల భారతీయుల అభిమానాన్ని చూరగొందని స్టాలిన్ కొనియాడారు.

నేను థ్రిల్‌కు గురయ్యాను: ప్రజ్ఞానంద

‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రజలు ఇక్కడికి వచ్చి చెస్‌ను గుర్తించడం చూసి నేను థ్రిల్‌కు గురయ్యాను. చెస్ ఒక క్రీడగా ఎదుగుతోందనడానికి ఇది నిదర్శనం. నేను పురోగతి సాధించినట్లు భావిస్తున్నాను. ప్రపంచ కప్‌ సాధించడమే నా ప్రధాన లక్ష్యం" అని ప్రజ్ఞానంద తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన కుమారుడికి లభించిన ఘన సన్మానాన్ని చూసి ప్రజ్ఞానంద తల్లి నాగలక్ష్మి ఆనందం వ్యక్తం చేసింది. ప్రజ్ఞానంద అక్క ఆర్.వైశాలి కూడా చెస్ క్రీడాకారిణి. ఆమె యూత్ చెస్ ఛాంపియన్‌గా రెండుసార్లు నిలిచింది.


Similar News