ఓటీటీ అయినా అదే ఎఫెక్ట్.!
దిశ, వెబ్ డెస్క్: నిజ జీవిత కథల నుంచి సినిమాలు తీయడం అవి పెద్ద హిట్ అవడం ఎప్పట్నుంచో జరుగుతూనే ఉంది. ఒకరి జీవితకథను సినిమాగా తీయడానికి ముందు అందరికీ ఆ వ్యక్తి గురించి తెలిసి ఉంటుంది. కానీ, సినిమాలో ఆయన కథను చూసిన తర్వాత కానీ దాని ప్రభావం కనిపించదు. అంటే ఆ వ్యక్తి జీవిత కథను బయోపిక్ మనకు దగ్గర చేస్తుంది. ఆయన జీవితాన్ని మనమే గడుపుతున్నామా అనే అనుభూతిని ఇస్తుంది. కేవలం బయోపిక్ […]
దిశ, వెబ్ డెస్క్: నిజ జీవిత కథల నుంచి సినిమాలు తీయడం అవి పెద్ద హిట్ అవడం ఎప్పట్నుంచో జరుగుతూనే ఉంది. ఒకరి జీవితకథను సినిమాగా తీయడానికి ముందు అందరికీ ఆ వ్యక్తి గురించి తెలిసి ఉంటుంది. కానీ, సినిమాలో ఆయన కథను చూసిన తర్వాత కానీ దాని ప్రభావం కనిపించదు. అంటే ఆ వ్యక్తి జీవిత కథను బయోపిక్ మనకు దగ్గర చేస్తుంది. ఆయన జీవితాన్ని మనమే గడుపుతున్నామా అనే అనుభూతిని ఇస్తుంది. కేవలం బయోపిక్ అని మాత్రమే కాదు సమాజానికి ఉపయోగపడే అంశాలతో ఉన్న ఏ సినిమా అయిన ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. అయితే థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది, ఆ ప్రభావం కనిపిస్తుంది అనే గతంలో అనుకునేవారు. లేదు..ప్రభావితం చేయగల సినిమాను ఎక్కడ చూసినా దాని ప్రభావంలో ఎలాంటి మార్పు ఉండదని ఇటీవల ఓటీటీల్లో విడుదలైన సినిమాలు, షోస్ నిరూపించాయి.
ముఖ్యంగా ప్రైమ్ వీడియోలో విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా అయితే యువత మీద తీవ్రంగా ప్రభావం చూపించింది. ‘సింప్లిఫై దక్కన్’ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే ఒక్కొక్కరు రెండు మూడు సార్లు చూశారు. సాధారణ స్థాయి నుంచి ఎయిర్‌లైన్స్ కంపెనీ యజమానిగా ఎదిగిన వ్యక్తి జీవిత క్రమాన్ని చూసి చాలా నేర్చుకున్నారు. ఈ సినిమా చూశాక గోపీనాథ్ గురించి గూగుల్‌లో వెతికి మరీ మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. వెంచర్ క్యాపిటలిజం గురించి అధ్యయనాలు చేశారు. ఇప్పుడు ఎలాగూ పరిస్థితులు బాలేవు కాబట్టి తమకు ఉన్నంతలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడమా లేదా మరేదైనా తమకు నచ్చిన స్టార్టప్ ప్రారంభించడమా లాంటి వ్యాపారాభివృద్ధి ఆలోచనలు చేస్తున్నారు. ఎప్పట్నుంచో మనసు లోతుల్లో దాగి ఉన్న బిజినెస్ ఆలోచనలు ఈ సినిమా స్ఫూర్తితో బయటకు వస్తున్నాయి.
సోనీ లివ్‌లో విడుదలై నోటి మాట, ఇంట్రో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా పాపులర్ అయిన ‘స్కామ్ 1992’ సిరీస్ అయితే యువతలో స్టాక్ మార్కెట్, షేర్‌లలో పెట్టుబడి గురించి కొత్త ఆలోచనను రేకెత్తించింది. ఆ సిరీస్ అర్థం కావాలంటే స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన కొన్ని పదాలకు అర్థం తెలియాలి. అలాగే గతంలో స్టాక్ మార్కెట్ ఎలా పనిచేసింది? ఇప్పుడెలా పనిచేస్తోంది? మనీ మార్కెట్ అంటే ఏంటి? లాంటి విషయాలన్నీ ఈ సిరీస్ ద్వారా తెలిశాయి. కరోనా కారణంగా ఎలాగూ నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్‌లో తక్కువకు వస్తున్న, ఎదగడానికి స్కోప్ ఉన్న కంపెనీల స్టాక్‌లు జనాలు కొనేస్తున్నారు. ఇవి కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘మిస్ ఇండియా’ సినిమా చూసి టీ బిజినెస్ క్రేజ్ గురించి అర్థం చేసుకున్నారు. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా ఉండే టీ బిజినెస్‌ను కూడా కొత్తగా పెట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో యువత ఆలోచిస్తున్నారు.
డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ‘అమ్మోరు తల్లి’ సినిమా చూశాక కష్టకాలాల్లో కూడా బాబాలు, పూజారుల దగ్గరికి వెళ్లొద్దని అర్థం చేసుకున్నారు. ఒకవేళ వెళ్లినా మీరు చెప్పినట్లు జరుగుతుందని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు. ఇలా సినిమా, సిరీస్ ఎక్కడ విడుదలైనా దాని ప్రభావం మాత్రం తగ్గట్లేదు. కాబట్టి థియేటర్‌లో విడుదలైతేనే సినిమాను ఆదరిస్తారు, దాన్ని చూసి స్ఫూర్తి పొందుతారనే అపోహకు ఓటీటీల్లో విడుదలై హవా సృష్టిస్తున్న ఈ కంటెంట్ సాక్ష్యంగా నిలుస్తోంది.