#Blackout Challenge on TikTok : ‘డేంజరస్’ చాలెంజెస్.. ‘బ్లాక్ అవుట్’ చాలెంజ్‌తో టీనేజర్ల మృతి

దిశ, ఫీచర్స్ : ‘సోషల్ మీడియా’లో ఎప్పుడు ఏ చాలెంజ్ పుట్టుకొస్తుందో తెలియదు. నీటిబొట్టులా ఏదో దేశంలో మొదలైన చాలెంజెస్ ప్రపంచాన్ని సునామిలా చుట్టేస్తాయి. సిల్లీ, ఫన్నీ చాలెంజెస్‌ను పక్కనపెడితే సోషల్ మీడియా ‘అతి ప్రమాదకర’ సవాళ్లకు వేదికగా నిలిచింది, నిలుస్తోంది. వేలం వెర్రిగా నిలిచే ఈ సవాళ్ల వల్ల ప్రమాదపు అంచులవరకు వెళ్లినవారు కోకొల్లలుండగా, మరణించిన వారు కూడా ఉన్నారు. ప్రధానంగా టీనేజర్లను ఆకర్షించే ఈ డేంజరస్ చాలెంజెస్ ప్రస్తుతం పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. యువకులు సవాళ్లు […]

Update: 2021-05-29 20:39 GMT

దిశ, ఫీచర్స్ : ‘సోషల్ మీడియా’లో ఎప్పుడు ఏ చాలెంజ్ పుట్టుకొస్తుందో తెలియదు. నీటిబొట్టులా ఏదో దేశంలో మొదలైన చాలెంజెస్ ప్రపంచాన్ని సునామిలా చుట్టేస్తాయి. సిల్లీ, ఫన్నీ చాలెంజెస్‌ను పక్కనపెడితే సోషల్ మీడియా ‘అతి ప్రమాదకర’ సవాళ్లకు వేదికగా నిలిచింది, నిలుస్తోంది. వేలం వెర్రిగా నిలిచే ఈ సవాళ్ల వల్ల ప్రమాదపు అంచులవరకు వెళ్లినవారు కోకొల్లలుండగా, మరణించిన వారు కూడా ఉన్నారు. ప్రధానంగా టీనేజర్లను ఆకర్షించే ఈ డేంజరస్ చాలెంజెస్ ప్రస్తుతం పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. యువకులు సవాళ్లు స్వీకరించేందుకు ఎప్పుడూ ముందుంటారు. అవి జీవితంలో ఎదగడానికి, పరిణితి చెందడానికి. కానీ సోషల్ మీడియా పుణ్యమాని.. ఆరోగ్యకరమైన సవాళ్లను వీడి, ప్రాణాలతో చెలగాటమాడే చాలెంజెస్ యాక్సెప్ట్ చేసే ధోరణి పెరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పటివరకు వచ్చిన డేంజరస్ చాలెంజెస్‌పై ప్రత్యేక కథనం.

నోట్ : ఈ సవాళ్లు చాలా ప్రమాదకరమైనవి. ఇంట్లోనే కాదు, ఎక్కడ, ఎప్పుడూ కూడా ఇలాంటి చాలెంజెస్ ప్రయత్నించే పనిచేయద్దని మనవి.

కొంతకాలంగా సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీని ప్రభావం చిన్నారులు, టీనేజర్స్ మీద అధికంగా ఉంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ వేదికగా భయానక ధోరణి(స్కారీ ట్రెండ్)ని మన కళ్ల ముందు చూస్తున్నాం. అందుకు సాక్ష్యమే సిరీస్ ఆఫ్ సోషల్ మీడియా చాలెంజెస్. వీటి ఆకర్షణలో పడిన టీనేజర్లు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో తరుచుగా కనిపిస్తుండటం కలవరపెట్టే అంశం. ఈ ప్రమాదకరమైన సవాళ్లతో తీవ్రమైన గాయాలు, మరణాలు సంభవిస్తున్నా.. కొత్తగా చాలెంజ్ తీసుకునేందుకు వెనుకాడటం లేదు యూత్.

తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల సోషల్ మీడియా వినియోగంపై అవగాహన లేకపోవడం ఇలాంటి ఘోర ప్రమాదాలకు మరింత ఊతమిస్తున్నాయి. ఆన్‌లైన్ ట్రెండ్స్ ఫాలో అయిపోయి, పాజిటివ్ కామెంట్స్ మాయలో పడి స్నేహితులు, ఇతర ఆన్‌లైన్ యూజర్స్ సపోర్ట్‌తో చాలెంజ్ యాక్సెప్ట్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు టీనేజర్స్. ఈ క్రమంలోనే తెరమీదకు వచ్చింది ‘బ్లాక్ అవుట్’ చాలెంజ్. షార్ట్ వీడియో యాప్ ‘టిక్‌టాక్’‌లో ఇటీవల కాలంలో బాగా పాపులరైన చాలెంజ్ ఇది. ఈ వైరల్ ట్రెండ్‌లో భాగమైన వ్యక్తులు తమను తాము స్పృహ కోల్పోయేంత వరకు ఊపిరి బిగపట్టుకోవాలి.

ఆ తర్వాత తమకు స్పృహ వచ్చాక మేల్కొంటారు. ఈ ప్రమాదకరమైన చర్య వల్ల మూర్చ రావడం, మెదడు దెబ్బతినే అవకాశాలుండగా, మరణానికి కూడా దారి తీసే అవకాశముందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అయినా అవేవి పట్టించుకోకుండా ఈ సవాలును స్వీకరించిన అమెరికాకు చెందిన 12ఏళ్ల కుర్రాడు జాషువా హైలీసస్, పందొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇటీవలే మరణించాడు. ఈ చాలెంజ్ మూలాన గతంలో పదేళ్ల బాలిక కూడా చనిపోయింది.

టిక్‌టాక్‌లో ఇటీవల కాలంలో పాపులర్ అవుతున్న ‘బ్లాక్ అవుట్ చాలెంజ్’ గేమ్ ఇప్పటిది కాదు ఇదివరకే ఉంది. దీన్నే పాస్-అవుట్ చాలెంజ్, ది చోకింగ్ గేమ్, స్పేస్ మంకీ చాలెంజ్, ఫెయింటింగ్ గేమ్ వంటి ఇతర పేర్లతో పిలుస్తారు. ఈ సవాలు ఫలితంగా 1995 – 2008 మధ్యకాలంలో దాదాపు 82 మంది యువకులు యూఎస్‌లో మరణించారని సిడిసి తన నివేదికలో పేర్కొంది. ఈ అధ్యయనం మరణాల సంఖ్యను తక్కువగా అంచనా వేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 11 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలే ఎక్కువగా మరిణించారని, అందులోనూ 87% మరణాలు మగ పిల్లలలో సంభవించాయని రీసెర్చర్స్ భావిస్తున్నారు. వీరి సగటు వయస్సు 13‌గా పేర్కొన్నారు.

ఫైర్ చాలెంజ్ (Fire Challenge)

ఫైర్ ఛాలెంజ్ అనేది ప్రమాదకరమైన సవాలు. దీంట్లో భాగమైన వ్యక్తులు.. హెయిర్‌స్ప్రే లేదా మండే ద్రవాలను ఉపయోగించి తమ శరీరంపై వేర్వేరు ఆకృతులను గీస్తారు. చీకట్లో తాము గీసిన బొమ్మకు నిప్పంటించుకుంటారు. దీన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఈ ట్రెండ్‌ను చాలా మంది ప్రయత్నించడంతో టిక్‌టాక్‌లో ప్రజాదరణ పొందింది. తాజాగా ఐసీయూలో చికిత్స పొందుతున్న పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన 13ఏళ్ల కుర్రాడు ఈ చాలెంజ్‌లో పాల్గొనడం దుమారాన్ని రేపింది. అయితే ఈ ట్రెండ్ ఫాలో అయ్యే వ్యక్తులపై కంప్లయింట్ ఇవ్వాల్సిందిగా అమెరికా, యూకే ప్రభుత్వాలు నెటిజన్లకు సూచించాయి. అంతేకాదు సదరు వ్యక్తుల మానసిక ఆరోగ్య సహాయం కోసం సైక్రియాటిస్టుల నెంబర్లను అందించింది.

సాల్ట్ అండ్ ఐస్ చాలెంజ్ (Salt and Ice Challenge) :

ఈ చాలెంజ్‌లో పాల్గొన్న వ్యక్తుల చేతిలో లేదా బహిర్గతమైన చర్మంపై ఎక్కడైనా ఉప్పు వేసుకుని, ఆపై ఐస్ పెట్టుకుంటారు. ఈ మిశ్రమం కలిగించే నొప్పిని ఎక్కువసేపు ఎవరు భరించగలరన్నదే చాలెంజ్. సాల్ట్ అండ్ ఐస్ కలిసి.. యుటెక్టిక్ ఫ్రిగోరిఫిక్ మిశ్రమాన్ని సృష్టిస్తుంది. ఇది −18 ° C (0 ° F) వరకు చల్లగా ఉంటుంది. ఉప్పు, ఐస్ చాలెంజ్ 2-3° C చేరగానే గాయాలకు కారణమవుతుంది. చర్మంపై పుండ్లు ఏర్పడటంతో పాటు కాలిపోయే అవకాశం కూడా ఉంది.

హీలియం హఫింగ్ :

సెలబ్రిటీలు హీలియం పీల్చుకుని, ఫన్నీ వాయిస్‌లో మాట్లాడే సిట్‌కామ్స్, లేట్ నైట్ షో‌స్ చూసే ఉంటారు. ఇది చాలా సేఫ్ గేమ్ అని అనుకుంటున్నారు? కదా! కానీ కాదు. గట్టిగా నోట్లోకి హీలియమ్‌ను పీల్చుకోవడం వల్ల శరీరం నుంచి ఆక్సిజన్ బయటకు పోతుంది. దీంతో ఊపిరితిత్తులు కొలాప్స్ అయిపోతాయి. స్వచ్ఛమైన హీలియం పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి, కేవలం నిమిషాల్లో ఊపిరాడకుండా మరణానికి కారణమవుతుంది. ప్రెజరైజ్డ్ ట్యాంక్ నుంచి హీలియం పీల్చడం వల్ల గ్యాస్ లేదా ఎయిర్ ఎంబాలిజమ్ కూడా వస్తుంది. ఇది ఒక బుడగ. ఇది రక్తనాళంలో చిక్కుకొని, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

ద అవుట్‌లెట్ చాలెంజ్ (THE outlet challenge)

మొబైల్‌ను చార్జ్ చేసేందుకు పాక్షికంగా ప్లగ్ ఇన్ చేసి, ఆపై ఓ నాణెంతో బహిర్గత చార్జింగ్ వైపు జారవేయడం. దీని ఫలితంగా షార్ట్ సర్య్కూట్ కావడం, మొబైల్ పేలిపోవడం లేదా మంటలు రావడం, విద్యుదాతఘాతం ఏర్పడటం జరుగుతుంది. ఇది కూడా టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌లోనే ఎక్కువగా వైరల్ అయింది.

బర్డ్‌బాక్స్ చాలెంజ్ ( Birdbox Challenge ) :

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌తో ప్రేరణ పొందిన యువతీయువకులు ఈ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. రోజువారీ పనులు చేసేటప్పుడు తమ కళ్లకు గంతలు కట్టుకోవాలి. టీనేజర్స్ సవాలును తీవ్రస్థాయికి తీసుకువెళ్లి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఉటాకు చెందిన ఒక అమ్మాయి డ్రైవింగ్ చేసేటప్పుడు తన క్యాప్ కళ్లపై వేసుకున్న తర్వాత తన కారుపై నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైంది.

ఇక ఎంతోమందిని బలి తీసుకున్న ‘బ్లూ వేల్ చాలెంజ్’ గురించి వేరే చెప్పనక్కర్లేదు. కికి చాలెంజ్, కార్ సర్ఫింగ్ చాలెంజ్, స్నార్టింగ్ కండోమ్ చాలెంజ్, ద బాయిలింగ్ వాటర్ చాలెంజ్ ఇలా మరెన్నో ప్రమాదకరమైన చాలెంజె‌స్ సోషల్ మీడియా వేదికగా విషం చిమ్ముతున్నాయి. వేలంవెర్రిలో పడి యువతీయువకులు సవాళ్లను స్వీకరించి తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ప్రధానంగా పిల్లలు ‘థ్రిల్’ కోసం, లేదా ఆత్రుతలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.

అంతేకాదు నిరాశకు గురైన యువత కూడా ఇలాంటి చాలెంజెస్ స్వీకరించి ప్రమాదానికి గురికావచ్చు. ఎందుకంటే వారిలో ఎక్కువ ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు ఉండొచ్చని, రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి పిచ్చి ఆటల వైపు ఆకర్షణకు లోనవుతున్న పిల్లలను తల్లిదండ్రులే గమనించాలి. వారి మానసిక స్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ వారితో కమ్యూనికేట్ అవుతూ.. స్నేహంగా మాట్లాడాలని, వారి అవసరాలను తెలుసుకోవాలని మానసికవేత్తలు సూచిస్తున్నారు. మూడ్ స్వింగ్స్‌తో పాటు ఏకాంతంగా ఉండే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలంటున్నారు.

Tags:    

Similar News