టార్గెట్ ఈటల.. హుజురాబాద్ ఓటర్లకు టీఆర్ఎస్ తాయిలాలు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్ ఎపిసోడ్‌తో ఉపఎన్నికలు అనివార్యం అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తాయిలాలు ప్రకటించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ముఖ్య నేతలంతా కూడా హుజురాబాద్ పైనే కన్నేసి ఈటల ప్రాభావాన్ని తగ్గించే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే, ప్రజల నుండి వస్తున్న ప్రతిపాదనలకు కూడా చకాచకా ఆమోద ముద్ర వేసే పనిలో ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి ప్రతిపాదనలు తీసుకుని ఆయా మునిసిపాలిటీలు, పంచాయతీల్లో అభివృద్ది […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్ ఎపిసోడ్‌తో ఉపఎన్నికలు అనివార్యం అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తాయిలాలు ప్రకటించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ముఖ్య నేతలంతా కూడా హుజురాబాద్ పైనే కన్నేసి ఈటల ప్రాభావాన్ని తగ్గించే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే, ప్రజల నుండి వస్తున్న ప్రతిపాదనలకు కూడా చకాచకా ఆమోద ముద్ర వేసే పనిలో ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇప్పటికే స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి ప్రతిపాదనలు తీసుకుని ఆయా మునిసిపాలిటీలు, పంచాయతీల్లో అభివృద్ది పనులకు నిధుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అవుతున్నాయి కూడా.
దీంతో నియోజకవర్గం కేడర్ ఈటల వెంట ఉండేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన క్రేజీ తగ్గకపోవడంతో ఇక వ్యక్తిగత లాభాలు అందించే పనిలో అధికార పార్టీ నాయకులు పడ్డట్టు స్పష్టం అవుతోంది. శనివారం జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక నాయకులు, ప్రజల నుండి వచ్చిన ప్రతిపాదనలపై స్పందించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని స్థానికులు ఆరూరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందిస్తూ పెన్షన్లకు అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయించేందుకు చొరవ తీసుకుంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే రమేష్ ప్రకటనతో ఓటర్లను పార్టీకి అనుకూలంగా మల్చుకునే పనిలో టీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఓటర్లకు వ్యక్తిగత లాభాలను అందించడం వల్ల ఈటల ప్రాభావాన్ని మసకబారే విధంగా చేయాలని భావిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది.
ఈటల వ్యతిరేకులపై నజర్..
మరో వైపున హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ వ్యతిరేక వర్గంపై కూడా టీఆర్ఎస్ పార్టీ నజర్ పెట్టింది. ఆయన వల్ల నష్టపోయిన వారు, ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని కూడా రంగంలోకి దింపే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ నాయకత్వం మునిగిపోయింది. ఇప్పటికే కొంతమంది నాయకులు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే ఇలాంటి వారిని గ్రామ స్థాయిలో గుర్తించి ఈటలను డ్యామేజ్ చేసేందుకు కసరత్తులు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
టార్గెట్ 2001..
టీఆర్ఎస్ మరో కొత్త ఎత్తుగడతో రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌లో చేరక ముందు ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తిస్తున్నారు. 2001లో టీఆర్ఎస్‌తో కలిసి నడిచిన అప్పటి కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాలకు చెందిన వారి జాబితా కూడా సిద్దం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తొలితరం ఉద్యమకారులు వీరేనని ప్రచారం చేస్తూ వారిని ఈటల ఎలా అణిచివేశారో ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.