ఏనుమాములలో ఇది మామూలేనా…?

దిశ, వరంగల్: దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుంది వరంగల్ ఏనుమాముల మార్కెట్లో అధికారులు, వ్యాపారుల పరిస్థితి. కరోనా వైరస్ లాక్ డౌన్ తో మార్కెట్ కు సెలవులు ప్రకటించినప్పటికీ యథేచ్ఛగా అనధికార కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం బహిరంగ రహస్యమే అయినప్పటికీ పాలక వర్గం, అధికార యంత్రాంగం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు పట్టించుకోకపోవడం అనుమానాలకు దారి తీస్తోన్నది. వీరంతా కలిసి మార్కెట్‌ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అమాయక రైతులను మోసం చేస్తున్న దళారులకు […]

Update: 2020-04-30 00:45 GMT

దిశ, వరంగల్: దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుంది వరంగల్ ఏనుమాముల మార్కెట్లో అధికారులు, వ్యాపారుల పరిస్థితి. కరోనా వైరస్ లాక్ డౌన్ తో మార్కెట్ కు సెలవులు ప్రకటించినప్పటికీ యథేచ్ఛగా అనధికార కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం బహిరంగ రహస్యమే అయినప్పటికీ పాలక వర్గం, అధికార యంత్రాంగం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు పట్టించుకోకపోవడం అనుమానాలకు దారి తీస్తోన్నది. వీరంతా కలిసి మార్కెట్‌ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా అమాయక రైతులను మోసం చేస్తున్న దళారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్ బంద్ ను క్యాష్ చేసుకుంటున్న దళారులు రైతుల నుంచి మిర్చిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి వారి పేరుతో వడ్డీ లేని రుణాలు కొట్టేసేందుకు ఎత్తులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోన్నది.

మార్కెట్ ఆదాయానికి గండి…!

రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కోనసాగిస్తోన్నది. ఈ నేపథ్యంలో గత నెల 22 నుంచి వరంగల్ ఏనుమాముల మార్కెట్‌ యార్డ్‌కు సెలవులు ప్రకటించారు. అప్పటికే మిర్చి పంట చేతికి రావడంతో మార్కెట్ కు తెచ్చి విక్రయించేందుకు సిద్ధమయ్యారు రైతులు. మార్కెట్ కు సెలవులు ప్రకటించినందున ఎలాంటి ఉత్పత్తులు విక్రయించే నిమిత్తం ఇక్కడికి తీసుకురావద్దని అధికారులు రైతులకు తెలియజేశారు. మార్కెట్ తెరిచే వరకు వారి పంటలను కోల్డ్ స్టోరేజ్ లలో నిల్వ చేసుకోవచ్చని, సంబంధిత రైతులకు రైతు బంధు పథకం కింద పంటలపై 75 శాతం వరకు గరిష్టంగా రూ. 2 లక్షల వడ్డీ లేని రుణం పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఇదే అదునుగా భావించిన కొంతమంది వ్యాపారులు కోల్డ్‌ స్టోరేజ్‌, మిర్చి కళ్లాల వద్ద అడ్డాలు పెట్టి యథేచ్ఛగా అక్రమ కొనుగోళ్లకు తెరలేపారు. రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజ్‌ల వద్దకు తీసుకురాగా కొంతమంది కొనుగోలుదారులు, ఖరీదుదారులు వారి వద్దకు వెళ్లి లాక్‌డౌన్‌ ఇప్పట్లో ఎత్తి వేయరని, తరువాత కొనుగోలు ధర తగ్గుతుందని మాయ మాటలు చెప్పి తక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా కొంతమంది ఏకంగా ఏనుమాముల మార్కెట్ గేటు ముందే అక్రమ కొనుగోళ్లు చేస్తున్నారు. దళారుల మాయలో పడిన రైతులు మార్కెట్ బంద్ ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున మిర్చిని తరలించి తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టాల బారిన పడుతున్నారు. ఈ విధంగా రైతులు నష్టపోతుండగా మరో పక్క మార్కెట్ ఆదాయానికి గండి పడుతోన్నది.

అధికారుల కనుసన్నల్లో..

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో 25 కోల్డ్‌ స్టోరేజ్ లు ఉన్నాయి. ఇందులో 14లక్షల బస్తాలను నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. అయినప్పటికీ రైతులు మిర్చిని స్టోరేజీల్లో నిల్వ చేసుకోకుండా తక్కువ ధరకు అమ్ముకోవడం వెనుక కొంతమంది మార్కెట్‌ అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ లోని కొందరు కీలక అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు విమర్శలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం సుమారు 2 లక్ష ఎకరాలలో మిర్చి పంటను సాగు చేశారు. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి కరోనా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో మిర్చిని ఏరిన రైతులు ఎక్కవ కాలం బయట పంటను నిలువ చేయలేకపోతున్నారు. మిర్చి రంగు మారి క్వాలిటీ తగ్గే ప్రమాదం ఉందని భావిస్తున్న రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేందుకు వరంగల్ కు తీసుకువస్తున్నారు. దీన్ని అదునుగా భావించిన దళారులు అక్రమ దందాకు దిగారు. మార్కెట్ బంద్ ఉండటంతో రైతులు దళారులు చెప్పిన రేటుకు మిర్చిని అమ్ముకుంటున్నట్లు తెలుస్తోన్నది. దళారులు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు అక్రమ కాంటాలతో యథేచ్ఛగా కొనుగోళ్లు చేపడుతున్నా మార్కెట్‌ అధికారులు, పాలకవర్గ సభ్యులు పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలున్నాయి. మార్కెట్‌ కార్యదర్శి నుంచి మొదలుకుని చైర్మన్‌, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారికి ముడుపులు అందుతుండటంతో ఏమీ పట్టనట్లుగా అక్రమ దందాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags: warangal, enumamula market, illegal business, mirchi, officers

Tags:    

Similar News